దర్శకుడిగా మురుగదాస్ ఒకప్పుడు ఎలాంటి వైభవం చూశాడో తెలిసిందే. రమణ (ఠాగూర్ ఒరిజినల్, గజిని, తుపాకి, కత్తి లాంటి చిత్రాలతో సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు. ఐతే దర్శకుడిగా తిరుగులేని స్థాయిలో ఉన్నపుడు మురుగదాస్ పెద్దగా మాట్లాడేవాడు కాదు. మీడియాలో కనిపించేవాడూ కాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ వ్యక్తిగా కూడా మంచి పేరు సంపాదించాడు. ఐతే ఫెయిల్యూర్లు ఎలాంటి వ్యక్తినైనా మానసికంగానూ దెబ్బ తీస్తాయి అనడానికి మురుగదాసే ఉదాహరణ.
ఒకవైపు స్పైడర్, దర్బార్, సికందర్ లాంటి ఫెయిల్యూర్లతో వచ్చిన చెడ్డ పేరు సరిపోదని.. తన వైఫల్యాలకు ఎవరినో నిందించడం మొదలుపెట్టడంతో మురుగదాస్ మరింతగా పేరు పోగొట్టుకున్నాడు. ‘సికందర్’ రిలీజ్‌కు ముందు సల్మాన్ ఖాన్‌తో ఎంతో సన్నిహితంగా మెలుగుతూ.. ప్రమోషన్లలో కూడా అతడి మీద ప్రశంసలు కురిపించాడు మురుగదాస్. అలాంటిది సినిమా డిజాస్టర్ కాగానే నింద మొత్తం సల్మాన్ ఖాన్ మీదే మోపేయడానికి ప్రయత్నించడం విడ్డూరం.
షూటింగ్ సందర్భంగా ఏం జరిగినా.. ఒక సినిమా ఫెయిలవడానికి ప్రధాన బాధ్యత తీసుకోవాల్సింది దర్శకుడే. కానీ మురుగదాస్ మాత్రం సల్మాన్ లేటుగా షూటింగ్‌కు రావడం వల్ల, సినిమాలో పగటి పూట కనిపించే సీన్లను నైట్ ఎఫెక్ట్‌లో తీయడం వల్ల సినిమా ఆడలేదంటూ విచిత్రమైన సాకులు చెప్పాడు. అప్పుడే మురుగదాస్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్.. మురుగదాస్ మీద వేసిన కౌంటర్లతో అతడి పరువు పోయింది. షూటింగ్ సందర్భంగా మురుగదాస్ చేసిన తప్పులు, చివర్లో సినిమాను వదిలేసి వెళ్లిపోయిన వైనాన్ని బయటపెట్టాడు సల్మాన్. పైగా ఈ సినిమాను వదిలేసి వెళ్లి మురుగదాస్ తీసిన ‘మదరాసి’ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటూ వ్యంగ్యంగా స్పందించాడు.
మామూలుగా సౌత్ వాళ్లను బాలీవుడ్ వాళ్లు ఏమైనా అంటే.. ఇక్కడి వాళ్లు కౌంటర్ ఎటాక్ చేస్తారు. కానీ మురుగదాస్‌కు అలాంటి సపోర్ట్ రావట్లేదు. సల్మానే కరెక్ట్ అంటున్నారు. ‘మదరాసి’ ప్రమోషన్ల టైంలో సల్మాన్ మీద చేసిన విమర్శలు సరిపోదని.. తమిళ దర్శకులు ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేసేలా సినిమాలు తీస్తారని.. అందుకే ఇక్కడ వెయ్యి కోట్ల సినిమాలు రావని.. తెలుగు డైరెక్టర్లు ఎంటర్టైన్మెంటే లక్ష్యంగా సినిమాలు తీయడం వల్ల అవి భారీ వసూళ్లు సాధిస్తున్నాయంటూ మరో విడ్డూరమైన వాదన కూడా తీసుకొచ్చాడు మురుగదాస్.
ఆ కామెంట్ వల్ల కూడా మురుగ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ‘మదరాసి’ రిలీజ్ టైంలో మురుగదాస్ మీద మామూలు కౌంటర్లు పడలేదు. మురుగదాస్‌ను ప్రొఫెసర్‌గా, ‘మదరాసి’ సినిమాను ఆయన సమర్పించిన థీసిస్‌గా పేర్కొంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ‘మదరాసి’ కూడా మురుగదాస్ ఫ్లాప్ స్ట్రీక్‌కు అడ్డు కట్ట వేయకపోగా.. ఆయన కామెంట్ల వల్ల ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్.. మురుగదాస్‌కు ఇచ్చిన కౌంటర్లతో మరింతగా ఆయన పేరు చెడింది.