సీనియర్ నటుడు ఆది సాయికుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి ఒకటిన్నర దశాబ్దం దాటిపోయింది. కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో అతను మంచి విజయాలే సాధించాడు. తర్వాత ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆది కెరీర్ తిరోగమనంలోనే పయనించింది. వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. అవకాశాలకు లోటు లేదు.
ఆది వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. తన సినిమాలు రిలీజవుతున్న విషయం కూడా జనాలు గుర్తించని పరిస్థితి వచ్చింది. తన సినిమాల కోసం జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయింది. చాలా సినిమాలు నామమాత్రంగానే రిలీజయ్యాయి. కానీ చిత్రమైన విషయం ఏంటంటే.. ఆది సినిమాలకు ఓటీటీల్లో మంచి ఆదరణే దక్కుతోంది. తన సినిమాలు కొన్ని నేరుగా ఓటీటీలోనే రిలీజయ్యాయి కూడా. వాటన్నింటికీ వ్యూస్ పరంగా ఢోకా లేదు.
స్టార్ హీరోల సినిమాలకు కూడా డిజిటల్ డీల్స్ జరక్క నిర్మాతలు ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఆది చిత్రాలకు మాత్రం ఆ సమస్య లేదు. తన స్థాయికి మంచి రేటే ఇచ్చి సినిమాలను కొంటూ వస్తున్నాయి ఓటీటీలు. ఇప్పుడు ఆది కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘శంబాల’ మూవీకి కూడా ఆల్రెడీ డిజిటల్ డీల్ పూర్తయింది. శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడైపోయాయి. రెంటికీ మంచి రేట్లే వచ్చాయట.
ఈ రోజుల్లో ఇలా విడుదలకు కొన్ని వారాల ముందే డిజిటల్, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడవడం విశేషమే. ఐతే ఆన్ లైన్లో, టీవీల్లో ఆది సినిమాలకు ఎంత మంచి ఆదరణ దక్కినా.. థియేటర్లలో సినిమా హిట్టవడమే కీలకం. ఆ విషయంలో ఆది బాగా వెనుకబడిపోయాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ‘శంబాల’ రిలీజవుతోంది. దీని ప్రోమోలు ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. చాన్నాళ్ల తర్వాత ఆది సినిమా చూడ్డానికి జనాలు థియేటర్లకు రావడానికి స్కోప్ ఉన్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. మరి ఈసారైనా అతను కంటెంట్‌తో మెప్పించి బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొడతాడేమో చూడాలి.