లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించే సినిమా విషయంలో కొన్ని నెలల పాటు సస్పెన్స్ కొనసాగింది. మొదట ఈ సినిమాను సుందర్ సి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. కానీ కొన్ని రోజులకే ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. చివరకు శివకార్తికేయన్ తో డాన్ సినిమా తీసిన శిబి చక్రవర్తిని ఫైనల్ చేశారు.
ఒకే సినిమా అనుభవం ఉన్న దర్శకుడు రజినీ లాంటి స్టార్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే సందేహాలు వచ్చాయి. కానీ కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరూ అతనిపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శిబి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇంకా సినిమా ప్రారంభం కాకముందే తన కసరత్తు ఏ స్థాయిలో ఉందో రజినీ లుక్ విషయంలో తెలుస్తోంది. రజినీని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో శిబి ఏకంగా 83 లుక్స్ సిద్ధం చేయించాడు. స్టైలింగ్ టీమ్ సహాయంతో రజినీని 83 విధాలుగా చూపించే డిజైన్లు తయారు చేశారు.
కొన్ని రోజుల కసరత్తు తర్వాత వాటిలో నుంచి మూడు లుక్స్ ను ఎంపిక చేసి రజినీకి చూపించారు. అందులో ఒక లుక్ ను రజినీ, కమల్ కలిసి ఫైనల్ చేయనున్నారు. అభిమానులు రజినీని కొత్త స్టైల్ లో చూడబోతున్నారని ఆశిస్తున్నారు.
కేవలం లుక్ కోసమే ఇంత కష్టపడుతున్న శిబి, కథ విషయంలో ఇంకెంత శ్రద్ధ పెట్టాడో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. రజినీ ఇప్పటికే జైలర్ 2 పూర్తి చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. శిబి సినిమా షూటింగ్ ఎప్పుడైనా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వేసవిలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఈ సినిమా తర్వాత రజినీ, కమల్ హాసన్ తో కలిసి నటించే మరో సినిమాలో కనిపించనున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఒక యాక్షన్ సినిమాకు సిద్ధమవుతున్నారు.