hyderabadupdates.com movies రఫ్ఫ్ ఆడించేసిన భారత్

రఫ్ఫ్ ఆడించేసిన భారత్

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ఓటమి నుంచి టీమిండియా త్వరగానే కోలుకుంది. జనవరి 21న నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో బోణి కొట్టింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్, అర్ష్‌దీప్ సింగ్ పదునైన బౌలింగ్‌తో భారత్ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి కివీస్ బౌలర్లను వణికించాడు. అతనికి తోడుగా రింకూ సింగ్ (44), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) వేగంగా పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేమీసన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ ఒంటరి పోరాటం చేస్తూ 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. మార్క్ చాప్మన్ 39 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో 2 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు.

మొత్తానికి వన్డే సిరీస్ కోల్పోయిన కసిని భారత్ ఈ మ్యాచ్‌లో చూపించింది. అయితే భారీ స్కోరు సాధించినా, ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు వదిలేయడం, బుమ్రా లాంటి ప్రధాన బౌలర్లు పరుగులు సమర్పించుకోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కొంత ఆందోళనకు గురిచేసే అంశం. వచ్చే మ్యాచ్‌ల్లో ఈ లోపాలను సరిదిద్దుకుంటే టీమిండియా సిరీస్‌పై పట్టు సాధించడం ఖాయం.

Related Post