త్వరలో వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయాల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. విజయవాడలో తండ్రి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. వంగవీటి రాధా రంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని అన్నారు. పదేళ్ల నుంచి తాను పబ్లిక్ లైఫ్ నుంచి దూరంగా ఉన్నానని తెలిపారు. ఇప్పుడు క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
రాధా రంగా మిత్రమండలి సభ్యులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. తాను ఏ పార్టీలో చేరతాను అనేది రాధా రంగా మిత్రమండలి పెద్దలతో కలిసి భవిష్యత్తులో నిర్ణయిస్తానని అన్నారు. తనకు అన్న రాధాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. ఆయన మద్దతు తనకు ఉంటుందని నమ్ముతున్నానని తెలిపారు. రాజకీయంగా ఆయన నిర్ణయాలు ఆయనవి, తన నిర్ణయాలు తనవి అన్నారు.
ఏపీ రాజకీయాల్లో వంగవీటి రంగా పేరు తెలియని వారు ఉండరు. 80వ దశకంలో ఆయన కాపు సామాజిక వర్గ నేతగా, బెజవాడ ప్రాంతంలో బలమైన రాజకీయనేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1985లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1988 లో ఆయన హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ ఘటన సంచలనం రేకెత్తించింది. ఆయన కుమారుడు వంగవీటి రాధా ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆయన అంత యాక్టివ్ గా లేరు.
రంగా కుమార్తె ఆశకిరణ్ 20 ఏళ్ల కిందట తన తల్లికి బాసటగా ఆమె రాజకీయాల్లో ప్రచారం చేశారు. అనంతరం ఇప్పుడే బయటికి వచ్చారు. ఆమె వైసీపీలో చేరుతారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.