రాజధాని రైతుల సమస్యలన్నీ ఆరునెలల్లోగా పరిష్కరిస్తామని త్రీమెన్ కమిటీ హామీ ఇచ్చింది. స్వార్ధం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలు ఎవరూ నమ్మవద్దని కమిటీ సభ్యులు సూచించారు. ప్రతి రెండు వారాలకోసారి సమావేశమై రైతుల సమస్యలను పరిష్కరించేలా ముందుకెళ్తామని కమిటీ తెలిపింది. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన కమిటీ రెండో సమావేశం అమరావతిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కొన్ని ఇబ్బందులు వచ్చాయని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. రైతుల ప్లాట్లకు సంబంధించి ఇంకా కేవలం 700 ఎకరాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయన్నారు.
ఇప్పటికే 98 శాతం ప్లాట్ల కేటాయింపు పూర్తయిపోయిందన్నారు. జరీబు, మెట్ట భూములకు సంబంధించి క్షేత్ర స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత పరిష్కరిస్తామని తెలిపారు. మరోవైపు లంక అసైన్డ్ భూములకు సంబంధించి ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉందన్న మంత్రి….ఫిబ్రవరిలో తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు.
మంత్రి పొంగూరి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో రైతులకు సంబంధించి అన్ని సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు. రాజధానిలో ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని స్పష్టం చేసారు..రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరోవైపు భూములిచ్చిన రైతుల్లో ఇంకా కేవలం 719 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందని తెలిపారు. స్వార్థం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలను ఎవరూ నమ్మవద్దని మంత్రి కోరారు.