hyderabadupdates.com movies రాష్ట్రంలో ఒకేసారి 16 మంది మంత్రులు ఔట్

రాష్ట్రంలో ఒకేసారి 16 మంది మంత్రులు ఔట్

​గుజరాత్ రాజకీయాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని ఏకంగా 16 మంది మంత్రులు ఒకే రోజు రాజీనామా చేశారు. రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ భారీ ప్రక్షాళన జరిగింది. హైకమాండ్ నుంచి వచ్చిన సూచనతోనే, సీఎం భూపేంద్ర పటేల్ మొత్తం మంత్రివర్గాన్ని మార్చేందుకు స్వేచ్ఛ పొందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

​రాజీనామా చేసిన 16 మంది మంత్రుల్లో కేబినెట్ ర్యాంక్, స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు ఉన్నారు. ఈ అవుట్‌గోయింగ్ టీమ్‌లో నుంచి కేవలం 4 మంది సీనియర్లను మాత్రమే కొత్త మంత్రివర్గంలో కొనసాగించే అవకాశం ఉంది. బీజేపీ నాయకులు ఈ మార్పును ‘వ్యూహాత్మక రీసెట్’ అని పిలుస్తున్నారు. ఎన్నికల ముందు టీమ్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడం, ప్రజల్లో కొత్త ముఖాలను ఉంచడం దీని ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

​ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గం శుక్రవారం మధ్యాహ్నం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారు. ఈ భారీ మార్పు ఎంత వేగంగా జరిగిందో చెప్పడానికి, రాజీనామా చేసిన మంత్రులు ఇప్పటికే తమ ఆఫీసులను ఖాళీ చేయడం కూడా మొదలు పెట్టారు.

​భూపేంద్ర పటేల్ 2021లో సీఎం అయిన తర్వాత, 2022 ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. ఆ విజయం తర్వాత కూడా ఇంత పెద్ద స్థాయిలో మంత్రివర్గాన్ని మార్చడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి ఇప్పటికే కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. కొత్త టీమ్‌లో దాదాపు 22 నుంచి 23 మంది మంత్రులు ఉంటారని అంచనా.

​ఈ కేబినెట్ మార్పులో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే పార్టీ నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నారు. కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని మంత్రివర్గంలో కొనసాగించే చాన్స్ లేదు. అంతేకాకుండా, ఖాళీ అయిన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పోస్ట్‌ను కూడా తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉంది. హర్ష్ సంఘ్వి, కున్వర్జీ హల్పతి వంటి వారికి ఈ పదవి దక్కవచ్చనే చర్చ నడుస్తోంది. ​ఈ మాస్ స్ట్రాటజీ ద్వారా గుజరాత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడానికి హైకమాండ్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

Related Post