తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడితే.. అనుకున్నది సాధించి తీరాల్సిందే. గత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన పడిన ప్రయాస అందరికీ గుర్తుండే ఉంటుంది. కనీసం.. నిద్రాహారాలు కూడా ఆయన మరిచిపోయి ఆనాడు పనిచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ రూపంలో మరో ఎన్నిక వచ్చింది. వాస్తవానికి ఇది ఉప ఎన్నికే. దీనిని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి దీనిని సీరియస్‌గా తీసుకున్నారు.
ఇటీవల వరకు లైట్‌గానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్ స్పందించారు. కానీ, హైడ్రా సహా.. కాంగ్రెస్ పాలనకు ఇది రిఫరెండం అంటూ.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ కూడా అంతే సీరియస్‌గా తీసుకున్నారు. తాజాగా ఆయన.. పార్టీ నాయకులకు లక్ష్మణ రేఖలు విధించారు. మంత్రుల నుంచి నాయకుల వరకు.. అందరికీ అన్ని రకాల బాధ్యతలు.. అప్పగించారు. ఎట్టి పరిస్థితిలో విన్ అయ్యే తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు ఇచ్చారంటే..
రేవంత్ నిర్దేశం ఇదీ..
ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలి.
7 లేదా 8 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర స్థాయి నాయకుడు(మంత్రి) పర్యవేక్షించాలి.
డివిజన్ల వారీగా నేతల పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయాలి.
రోజుకు 250 ఇళ్లకు ఇంటింటి ప్రచారం చేయాలి.
ప్రతి రాష్ట్ర నాయకుడు 20 నుంచి 30 మందితో కలసి ఇంటింటి ప్రచారం చేయాలి.
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలి.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు డివిజన్ల వారీగా పర్యవేక్షించాలి.
పోలింగ్ కేంద్రాలవారీగానాయకులను ముందుండి నడపాలి.
ఈ నెల 9న ప్రచార గడువు ముగిసేవరకూ మంత్రులు పిలిస్తే పలకాలి.
నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా ఉన్న మంత్రుల పనితీరు మరింత మెరుగు పడాలి.
నామినేటెడ్ పదవులు పొందిన వారు కూడా.. ఏడు రోజులూ ప్రజల మధ్యే ఉండాలి.