ఔను! నిజమే. ఎక్కడైనా లిక్కర్ విక్రయిస్తేనే సొమ్ములు వస్తాయి. కానీ, లిక్కర్ అమ్మకుండానే తెలంగాణ సర్కారుకు కాసుల మోత మోగింది. రెండేళ్లకు ఒకసారి వైన్స్ దుకాణాలకు ప్రభుత్వం లైసెన్సులు ఇస్తుంది. అదే బార్లయితే.. 3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు వైన్స్ దుకాణాలకు లైసెన్సులు ఇచ్చే కార్యక్రమానికి కొన్నాళ్ల కిందటే తెరదీసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 వైన్స్ షాపులను ఏర్పాటు చేసుకునేందుకు ఇచ్చిన దరఖాస్తు గడువు.. ఈ నెల 24తో ముగిసింది. నిజానికి మరోసారి పెంచాలని అనుకున్నా.. మరోవైపు హైకోర్టులో కేసు ఉంది. దీంతో గడువును పెంచకుండా వచ్చింది చాలన్నట్టు ముగించారు.
ఇక, 2,620 దుకాణాలకు గాను.. మొత్తం 95,137 మంది నుంచి దరఖాస్తులువచ్చాయి. ఒక్కొక్క షాపునకు సగటున 10-15 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క షాపునకు(డిమాండ్‌ను బట్టి) వేల సంఖ్యలో దరఖాస్తులు కూడా వచ్చాయి. వీటిని లాటరీ విధానంలో తీసి.. లైసెన్సీలను ఎంపిక చేస్తారు. ఇదిలావుంటే.. అసలు సర్కారుకు ఆదాయం ఇక్కడే వచ్చింది. ఒక్కొక్క దరఖాస్తుకు రుసుము కింద రూ.3 లక్షల ధరను నిర్ణయించారు. అంటే.. దరఖాస్తు చేసుకునే వారు రూ.3 లక్షలు చెల్లించాలి. అయితే.. ఈ సొమ్మును ప్రభుత్వం తిరిగి ఇవ్వదు. సదరు దరఖాస్తు దారుడికి షాపు దక్కినా.. దక్కక పోయినా.. ఈ సొమ్మును వదులు కోవాల్సిందే.
ఈ లెక్కన 95,137 దరఖాస్తులకు రూ.3 లక్షల చొప్పున మొత్తం 2,854.11 కోట్ల రూపాయలు సర్కారు ఖజానాకు వచ్చి చేరాయి. ఈ సొమ్మును ప్రభుత్వం సంచిత నిధిలో ఉంచుతుంది. అంటే.. ఏ అవసరానికైనా దీనిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక సమస్యల్లో ఉన్న సర్కారుకు ఇది అందివచ్చిన ఆదాయమనే చెప్పాలి. కాగా.. గతంలో కేసీఆర్ హయాంలో 2023లో లైసెన్సులు ఇచ్చారు. అప్పట్లో ఒక్కొక్క దరఖాస్తు 1.32 లక్షల రూపాయల చొప్పున ధర నిర్ణయించారు. కానీ, రేవంత్ రెడ్డి సర్కారు దీనిని ఏకంగా రూ.3 లక్షలకు పెంచింది. ఏపీలో అయితే.. రూ.10 లక్షల చొప్పున వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇక, త్వరలోనే తెలంగాణ సర్కారు లాటరీ ద్వారా లైసెన్సులు ఇవ్వనుంది.
హైకోర్టులో కేసు!
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న లిక్కర్ విధానంపై హైకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. గతంలో రూ.1.32 లక్షలుగా ఉన్న దరఖాస్తు ఫీజును ఏకంగా రూ.3 లక్షలకు పెంచారని.. రెండు పిటిషన్లు పడ్డాయి. ఇది సరైన నిర్ణయం కాదన్నది పిటిషనర్ల వాదన. మరోవైపు.. ప్రభుత్వం తీసుకునే దరఖాస్తు ఫీజులను దుకాణాలు దక్కని వారికి తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ ఎక్కువ సంఖ్యలో పిటిషన్లు పడ్డాయి. అయితే.. వీటిపై విచారణ జరగాల్సి ఉంది. కానీ, ఇంతలోనే సర్కారు తాంబూలాలిచ్చేసినట్టు ప్రక్రియను ముగించేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.