వందేమాతరం గీతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శిం చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాతరం నినాదం కీలక భూమిక పోషించిందన్నారు. అదేవిధంగా జాతి ఐక్యతకు, సంఘీభావానికి వందేమాతరం ప్రతీకగా నిలిచిందని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ దీనిని కూడా అవమానించిందని.. వందేమాతరంలోని కొన్నిపంక్తులను తొలగించిందని విమర్శించారు.
దేశ మాజీ ఉప ప్రధాని, ఐక్యతా మూర్తి… సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఐక్యతా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి కీలకోపన్యాసం చేశారు.
భారతీయులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. జమ్ము కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 బంధనాలను తొలగించడంతో అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తెలిపా రు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులపై జరిపిన పోరును ప్రపంచం మొత్తం చూసిందన్నారు. భారత దేశ పాటవం ఏమిటో పాకిస్థాన్ సహా.. ఉగ్రవాదులకు కూడా తెలిసి వచ్చిందన్నారు. భారత దేశానికి హాని కలిగించాలని అనుకునే వారికి ఆపరేషన్ సిందూర్ సింహస్వప్నమని ప్రధాని చెప్పారు.
దేశంలో 2014 తర్వాత అనేక సవాళ్లను పరిష్కరించామని ప్రధాన మంత్రి తెలిపారు. నక్సలిజం సహా మావోయిస్టుల తీవ్రవాదాన్ని అణిచి వేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని తరిమికొట్టడం ఖాయమని ప్రధాని ఉద్ఘాటించారు. చొరబాటు దారుల వ్యవహారం దేశానికి తీవ్ర సమస్యగా పరిణమించిందని ప్రధాని చెప్పారు. చొరబాటు దారులు దేశ ఐక్య, అంతర్గత భద్రతకు సవాలు విసురుతున్నారని తెలిపారు.
కొన్ని దశాబ్దాలుగా విదేశీ చొరబాటు దారులు దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న ప్రధాని వారు మన పౌరుల వనరులను వినియోగించు కుంటూ.. మన భౌగోళిక సమతుల్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కానీ, గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. జాతీయ భద్రత విషయంలో గత ప్రభుత్వాలు రాజీ పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను పరిరక్షించడంలో తొలిసారి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరికొద్ది రోజుల్లోనే వందేమాతరం 150వ వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోనున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.