నవంబర్ 15 రివీల్ కాబోతున్న ఎస్ఎస్ఎంబి టైటిల్ ఏంటనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. లీకైన సోర్స్ నుంచి వినిపిస్తున్న పేరు వారణాసి. కానీ ఇంత పెద్ద గ్లోబల్ మూవీకి అలా పెడతారానే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ టైంలో కూడా ఇదే తరహాలో ఏం టైటిల్ పెడతారనే డిస్కషన్లు విపరీతంగా జరిగాయి. ఆఖరికి ప్రచారంలో ఉన్నదాన్నే ఖాయం చేసి ట్రిపులార్ అని నామకరణం చేయడం జాతీయ మీడియాని సైతం ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలయికకి ఇంతకన్నా గొప్ప పేరు పెట్టడం కష్టమని తర్వాత అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు వర్తమానానికి వద్దాం.
హఠాత్తుగా ఒక చిన్న సినిమా అనౌన్స్ మెంట్ వారణాసి టైటిల్ తో రావడం ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సిహెచ్ సుబ్బారెడ్డి నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ మూవీ ఫస్ట్ లుక్ ని పోస్టర్ రూపంలో వదిలారు. పెద్దగా వివరాలేం లేవు కానీ ఎస్ఎస్ఎంబి ఈవెంట్ ఇంకో రెండు వారాల్లో ఉందంనంగా ఇలా హఠాత్తుగా ప్రకటన ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే ముందు జాగ్రత్తగా వారణాసి టైటిల్ తమదని చెప్పుకున్నారా లేక రాజమౌళి వేరే టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు ముందు జాగ్రత్తగా కర్చీఫ్ వేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.
గతంలో ఖలేజాకి ఇలాంటి సమస్యే వస్తే టైటిల్ కు ముందు మహేష్ అని పెట్టి మేనేజ్ చేశారు. ఈ పేరు స్వంతదారు తర్వాత సినిమా తీయకపోవడం వేరే విషయం. ఇప్పుడు వారణాసికి అదే జరుగుతుందా లేక ఏదైనా ట్విస్టు ఉంటుందా అనేది వేచి చూడాలి. అయితే జక్కన్నని తక్కువంచనా వేయడానికి లేదు. చాలా పకడ్బందీగా ఆయన ప్లానింగ్ ఉంటుంది. ఎస్ఎస్ఎంబి 29కి వేరే టైటిల్ అనుకుని ఇప్పటిదాకా లీక్ కాకుండా కట్టుదిట్టంగా దాచి ఉంచినా ఆశ్చర్యం లేదు. క్రైమ్ థ్రిల్లర్ లాగా ఈ మలుపులు చివరికి ఎక్కడికి దారి తీస్తాయో తెలియాలంటే ఇంకో పదమూడు రోజులు ఎదురు చూడాల్సిందే.