hyderabadupdates.com movies వైసీపీ ఎమ్మెల్యేలపై యాక్షన్ ఎలా ఉంటుందంటే..

వైసీపీ ఎమ్మెల్యేలపై యాక్షన్ ఎలా ఉంటుందంటే..

వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మరోసారి స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు వారు హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారు ఇంట్లోనే కూర్చుంటామంటే ప్రజలు కూడా వారిని శాశ్వతంగా ఇంట్లోనే కూర్చోబెట్టే రోజులు వస్తాయని విమర్శించారు. సభకు రావాలని తామంతా కోరుతున్నామని చెప్పారు.

“ప్రధాన ప్రతిపక్షం అనేది ప్రజలు ఇవ్వాలి. జగన్‌కు అవసరమైతే ప్రజలను వెళ్లి అడగమండి. అంతేకాని ప్రధాన ప్రతిపక్షం ఇవ్వలేదని ప్రజల తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు సభకు రాకుండా మొండి చేస్తే మంచిదా?” అని అయ్యన్న ప్రశ్నించారు. ఇలాంటివారు సభకు ఎందుకు కొరగారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. సభకు రాకుండా జీతాలు తీసుకునేవారికి, అసలు సభకు రాకుండా ఉండేవారిపైనా చర్యలు తీసుకునేది ఖాయమని చెప్పారు.

ఈ క్రమంలో త్వరలోనే వైసీపీ సభ్యులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటామని అన్నారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు. వైసీపీ సభ్యులపై అనర్హత వేటు ఖాయమని చెప్పారు. ఈ చర్యలు దేశానికే రోల్ మోడల్‌గా మారుతాయని అన్నారు.

ఇకపై దేశంలోని ఏ అసెంబ్లీలో అయినా సభ్యులు గైర్హాజరై వేతనాలు తీసుకుంటే తాము తీసుకున్న చర్యలే తీసుకునేలా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు చెప్పారు.

ఇక గవర్నర్ ప్రసంగించిన రోజు సభకు వచ్చినా అది సభకు హాజరైనట్టు కాదని అయ్యన్న తెలిపారు. అది కేవలం లాంఛనప్రాయంగా సభకు రావడమేనని చెప్పారు. ఆ తర్వాత రోజు నుంచే అసెంబ్లీ లెక్కలోకి వస్తుందని అన్నారు.

నిబంధనలను కాదని వైసీపీ చేసే వాదనలకు అర్థం లేదన్నారు. తాము నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని వివరించారు. ప్రతి విషయంలోనూ వితండ వాదన చేయడం వైసీపీకి పరిపాటిగా మారిందని, ఈ వ్యవహారం శాసన మండలిలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

Related Post