సంస్థాగతంగా పార్టీలను బలోపేతం చేసుకోవడం అనేది కీలక పార్టీలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకూ అత్యంత అవసరం. ఈ విషయంలో రెండో మాటేలేదు. గతంలో కంటే ఇప్పుడు వీక్‌గా మారిందన్న వాదన వినిపిస్తున్న వైసీపీ ఈ విషయంపై దృష్టి పెట్టింది. తరచుగా పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ సంస్థాగతంగా (లోకల్) పార్టీని బలోపేతం చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలు, మండలాలు, గ్రామీణ స్థాయిలో నాయకులకు పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని భావిస్తున్నారు.
ఇది ఒకరకంగా గత ఎన్నికల్లో వచ్చిన ఫలితంతో పోల్చుకుంటే మంచి నిర్ణయమే. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పుంజుకునేలా చేయడం ద్వారా విజయాన్ని సాధించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నమనే చెప్పాలి. అయితే, ఈ విషయంలోనూ రెండు రకాల సమస్యలు పార్టీని వేధిస్తున్నాయి. కానీ, ఇవి పార్టీ అధినేతవరకు చేరుతున్నాయా అనేది ప్రశ్న. అలా చేరకపోతే లేదా చేరినా ఆయన మౌనంగా ఉంటే, మళ్లీ వైసీపీకి ఇబ్బంది తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
1) రాష్ట్రస్థాయిలో వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో పదవుల కోసం తమ వారిని సిఫారసు చేస్తున్నారు. దీనిపై అధ్యయనం చేయకుండా పార్టీ కూడా పదవులు ఇస్తోందన్న వాదన ఉంది. నిజానికి పార్టీలో కష్టపడి పనిచేసిన వారు, వైఎస్ అభిమానులు చాలా మంది ఉన్నారు. వీరికి గత ఐదేళ్లలో గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పుడైనా తమను గుర్తించాలని కోరుకుంటున్నారు. ఇక కేసులు పెట్టించుకున్న వారు కూడా ఉన్నారు. వీరు కూడా సహజంగానే గుర్తింపు కోరుతున్నారు. వీరిని అధినేత పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది.
2) కొన్ని జిల్లాల్లో మరో చర్చ సాగుతోంది. తాము పార్టీకోసం పనిచేసినా, అధికారంలో ఉన్నప్పుడు విస్మరించారని, వాడుకుని వదిలేశారని అంటున్నారు. ఇలాంటి వారికి జగన్ గతంలోనే హామీ ఇచ్చారు. ఈ దఫా కార్యకర్తలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. కానీ ఆయన మాటకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు మధ్య పొంతన చిక్కడం లేదు. దీంతో పెద్దగా విశ్వాసం కలగడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏదేమైనా, సంస్థాగతంగా డెవలప్ అవ్వాలని అనుకున్నా విశ్వసనీయతే అసలు సమస్యగా మారిందన్నది వాస్తవం.