hyderabadupdates.com movies వైసీపీ మాజీ మంత్రిని కాపాడిన అధికార పార్టీ నాయకుడు?

వైసీపీ మాజీ మంత్రిని కాపాడిన అధికార పార్టీ నాయకుడు?

వైసీపీ నేత‌, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును పోలీసులు అరెస్టు చేస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. ఎందుకంటే.. ఆయ‌న‌ను సుమారు 7 గంట‌ల‌పాటు పోలీసులు సుదీర్ఘంగా విచారించ‌డ‌మే. అంతేకాదు.. పోలీసు స్టేష‌న్ ప్రాంగణంలోనూ.. అప్ర‌క‌టిత 144 సెక్ష‌న్ విధించ‌డంతో సీదిరి అరెస్టు ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న‌ను పోలీసులు ఇంటికి పంపించేశారు. దీనిపై వైసీపీలోనే కాదు.. ముఖ్యంగా టీడీపీలో చ‌ర్చ సాగుతోంది.

అస‌లు ఏం జ‌రిగింది?

శ్రీకాకుళం జిల్లా.. ప‌లాస మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.. వృత్తిగ‌తంగా డాక్ట‌ర్‌. ఇటీవ‌ల కాశీబుగ్గ‌లో జ‌రిగిన తొక్కిస‌లాట స‌మ‌యంలో ఆయ‌న బాధితుల‌కు సేవ‌లు కూడా అందించి వార్త‌ల్లో నిలిచారు. అయితే.. ఈ వృత్తిని ప‌క్క‌న పెడితే… రాజ‌కీయ నేతగా ఆయ‌న కూట‌మి స‌ర్కారుపై త‌ర‌చుగా విమర్శలు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబ‌రులో ప‌లాస‌లో ఓ బాలిక‌పై అఘాయిత్యం జ‌రిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేపింది.

ఈ కేసును పోల‌సులు విచారిస్తున్న స‌మ‌యంలోనే సీదిరి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పోలీసులు త‌క్ష‌ణ‌మే.. బాధితుల‌ను అరెస్టు చేయాల‌న్నారు. ఇదేస‌మ‌యంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, సీదిరి అనుచ‌రులు.. స్టేష‌న్‌ను ముట్ట‌డించారు. వీరిలో కొంద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప‌రిణామాల‌పై మ‌రింత రెచ్చిపోయిన సీదిరి.. కాశీబుగ్గ పోలీసుస్టేష‌న్‌కు టీడీపీ జెండా రంగు(ప‌సుపు)లు వేస్తామ‌ని.. దీనిని ప్రైవేటు పోలీసు స్టేష‌న్‌గా పేరు పెడ‌తామ‌ని.. ఎస్పీతో రిబ్బ‌న్ క‌టింగ్ చేయిస్తామ‌ని వ్యాఖ్యానించారు.

ఆ వ్యాఖ్య‌ల‌పై ఓ సామాజిక‌ కార్య‌క‌ర్త ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. అనంత‌రం.. స్టేష‌న్‌కు వ‌చ్చిన సీదిరిని సుదీర్ఘంగా ఏడు గంట‌ల పాటు విచారించారు. అయితే.. రాత్రి స‌మ‌యంలో ఆయ‌న‌ను అరెస్టు చేస్తున్నార‌న్న వార్త‌లు వ‌చ్చినా.. అనూహ్యంగా పోలీసులు ఆయ‌న‌ను వ‌దిలేశారు. దీని వెనుక ప్ర‌భుత్వంలోని ఓ కీల‌క నాయ‌కుడు ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ‌కీయ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో అరెస్టు చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని.. వైసీపీ వ్య‌వ‌హ‌రించిన‌ట్టుగా మ‌నం వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని చెప్ప‌డంతోనే సీదిరి నుంచి సంత‌కాలు తీసుకుని వ‌దిలేశార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Related Post