టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, అదే పార్టీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నాయకులే. పైగా ఉన్నత విద్యను అభ్యసించిన వారే. ప్రస్తుతం వారు నియోజకవర్గాలపై మంచి పట్టుపెంచుకున్నారు. వైసీపీకి కౌంటర్ ఇస్తూ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలోనూ నిరంతరం పనిచేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ‘మేమున్నాం’ అంటూ ముందుకు వస్తున్నారు. అర్థరాత్రి, పట్టపగలు అనే తేడా లేకుండా వారు పనిచేస్తున్నారు. దీనిలో సందేహం లేదు.
అయితే పార్టీపరంగా వారికి ఎంత మేరకు మద్దతు లభిస్తున్నదన్నది ప్రశ్న. నిజంగా చెప్పాలంటే వారిద్దరూ కూడా ఒంటరి పోరును కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని వారే కాదు పార్టీలో ఉన్న సీనియర్లు కూడా చెబుతున్నారు. పార్టీ పరంగా వారికి పెద్దగా సపోర్టు లభించడం లేదన్నది వారి మాట. వాస్తవానికి ఇలాంటివారిని పార్టీ డెవలప్ చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి బలమైన నాయకులుగా ఎదుగుతారన్నది సీనియర్ల అభిప్రాయం.
అయితే వీరిని వినియోగించుకునే తీరును బట్టి వారి పనితీరు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సూత్రం లేని గాలిపటంగా వారు ఎగురుతున్నారన్నది నిజమని చెబుతున్నారు. అలా కాకుండా స్వయంగా చంద్రబాబు వారిని సరైన దిశలో నడిపిస్తే బలమైన వాయిస్‌గా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే కావడం కలిసివస్తున్న అంశం. పార్టీ పరంగా వీరిని వ్యతిరేకించేవారు ఉన్నా పనితీరులో ఎక్కడా వారికి ఇబ్బందులు లేవు. విమర్శలు కూడా లేవు.
ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గమనిస్తే, కొంత వారికి దిశానిర్దేశం చేస్తే, వారికి చోదకశక్తిని అందిస్తే భవిష్యత్తులో మేటి నాయకులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. గతంలో అన్నగారు ఎన్టీఆర్ నన్నపనేని రాజకుమారితో సహా మరికొందరు మహిళా నాయకులను ప్రోత్సహించారు. వారు పార్టీకి ఎంతో మేలు చేశారు. పార్టీలైన్‌లోనే నడుచుకున్నారు. ఇలా నేటితరానికి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో దూకుడుగా ఉన్న ఇద్దరు మహిళా నాయకులకు చంద్రబాబు కొంత దిశానిర్దేశం చేయడం ద్వారా వారిని పార్టీకి ఉపయోగించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.