జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కుస్తీ పడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తుండగా… తమ ఖాతాలో మరో సీటు కోసం సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఐటమ్ సాంగ్ తో రేవంత్ రెడ్డి పోల్చడం షాకింగ్ గా మారింది.
కాంగ్రెస్ మరిచిపోయిన హామీలు, నెవరేర్చని వాగ్దానాలను వారి మాటల్లోనే ప్రజలకు నేరుగా తెలియజేసేందుకు ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామని కేటీఆర్ క్లారిటీనిచ్చారు. 90 శాతం ఓటర్లు ఒక పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకొని ఉంటారని, మిగతా 10 శాతం ఓటర్లను ఆకట్టుకొని తమ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పేందుకే ఈ ప్రయాస అని స్పష్టం చేశారు. దేశంలో ఈ తరహాలో వినూత్న ప్రచారాన్ని మొదలుబెట్టింది బీఆర్ఎస్ అని అన్నారు.
కేటీఆర్ చేస్తున్న ప్రచారం పుష్ప సినిమాలో శ్రీ లీల ఐటం సాంగ్ లా ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. సినిమాలో స్టోరీ మధ్యలో ప్రేక్షకులను ఉత్తేజపరిచేందుకు ఐటమ్ సాంగ్ వస్తుందని, కేటీఆర్ ప్రచారం కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ఐటం సాంగ్స్ ను ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానని చెబుతున్న కేటీఆర్ ..తన పార్టీ కండువాను గాల్లో తిప్పుతున్నారని విమర్శించారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్ మహిళలకు రక్షణ కల్పిస్తాడా అని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులు తీరుస్తూనే పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.
కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్‌లతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ ఏర్పడిందన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని నిలదీశారు. ఈ సారి అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేసి చూపిస్తామని హామీనిచ్చారు.
“కేటీఆర్ చేస్తున్న ప్రచారం పుష్ప సినిమాలో శ్రీలీల ఐటం సాంగ్ లెక్క ఉంది.”– #RevanthReddy pic.twitter.com/QSIRhAjr6x— Gulte (@GulteOfficial) November 9, 2025