వరుస ప్రకృతి విపత్తులు శ్రీలంకను అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవలి మొంథా తుఫాను కారణంగా పది సంఖ్యల్లో ప్రజలు మృతి చెందారు. జనావాసాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ వేదన నుంచి ఇంకా కోలుకోక ముందే తాజాగా దిత్వా తుఫాను శ్రీలంకను ముంచెత్తింది. తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న వీడియోలే చెబుతున్నాయి. నిలువెత్తు నీటిలో ప్రజలు ప్రాణాలు పెట్టుకుని బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రస్తుతం శ్రీలంక తీరం వద్ద కేంద్రీకృతమైంది. కారైక్కల్ నుంచి 220 కిలోమీటర్లు, పుదుచ్చేరి నుంచి 330 కిలోమీటర్లు, చెన్నై నుంచి 430 కిలోమీటర్ల దూరంలో తుఫాను ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ తుఫాను ప్రభావంతో శ్రీలంక రాజధాని కొలంబో సహా పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు సరిపోవడం లేదు.
ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకుని 124 మంది ప్రాణాలు కోల్పోయారని శ్రీలంక సైన్యం ప్రకటించింది.
మరింత మంది ప్రజల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. 43 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక కెలాని నది పొంగిప్రవహించడంతో సమీప పట్టణాలు, గ్రామాలు మునిగిపోయాయి.
ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో అత్యవసర సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. వైమానిక దళానికి చెందిన ఒక భారీ విమానం, మరొక చిన్న విమానం ద్వారా 21 టన్నుల ఆహార పదార్థాలు, దుస్తులు, శానిటరీ సామగ్రిని కొలంబోకు పంపించారు. హిండన్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన ఈ విమానాలు బండరునాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
ఏపీ అప్రమత్తం
దిత్వా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఉదయం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ప్రత్యేకంగా తమిళనాడు, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలపై తుఫాను ప్రభావం చూపుతుందని అధికారులు అంచనా వేశారు. ఆకస్మిక వరదలు రావచ్చని హెచ్చరించారు.
ఈ నేపధ్యంలో సీఎంవో కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ముందస్తు చర్యలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.