hyderabadupdates.com movies సందీప్ వంగ… ఈసారి బ్రేక్ ఎవరికి?

సందీప్ వంగ… ఈసారి బ్రేక్ ఎవరికి?

సందీప్ రెడ్డి వంగ సినిమాలో నటించినా.. ఆ సినిమాకు సాంకేతిక సహకారం అందించినా.. వాళ్ల కెరీర్లు రాత్రికి రాత్రి మారిపోతుంటాయి. ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దేవరకొండ సహా చాలామందికి బ్రేక్ ఇచ్చాడు ఈ ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్. ఆ చిత్రాన్ని ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేసి.. షాహిద్ కపూర్‌కు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందించాడు. మరింత మందికి ఆ సినిమాతో బ్రేక్ దొరికింది. ఇక ‘యానిమల్’ మూవీ సందీప్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. 

స్టార్‌గా ఉన్న రణబీర్‌ కపూర్‌ను సూపర్ స్టార్‌ను చేసి ఒకేసారి టాప్ లీగ్‌లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేశాడు. ఇక ఎన్నో ఏళ్ల నుంచి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న బాబీ డియోల్‌.. ఇందులో విలన్ పాత్రతో అదరగొట్టి ఇండియాలోనే బిజీయెస్ట్ ఆర్టిస్టుల్లో ఒకడైపోయాడు. తృప్తి దిమ్రి సైతం ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మరి తన కొత్త చిత్రం ‘స్పిరిట్’తో సందీప్ ఎవరికి ఎలాంటి బ్రేక్ ఇస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ కొత్తగా చూడాల్సిన స్టార్‌డమ్ ఏమీ లేదు కానీ.. తన కెరీర్లో ఇదొక డిఫరెంట్, మైల్‌స్టోన్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా లాంచ్ చేసిన ఆడియో టీజర్ అభిమానుల్లో అమితాసక్తిని రేకెత్తించింది. దృశ్యం కనిపించకపోయినా.. రావాల్సిన గూస్ బంప్స్ వచ్చేశాయి. ఆ సన్నివేశానికి దృశ్యాన్ని ఊహించుకుని ఎగ్జైట్ అవుతున్నారు. ప్రభాస్‌తో పాటు టీజర్లో వినిపించిన వాయిస్ ప్రకాష్ రాజ్‌దన్న సంగతి తెలిసిందే. 

ప్రకాష్ రాజ్ గొప్ప నటుడే అయినా.. చాలా ఏళ్లుగా ఆయన మొనాటనస్ క్యారెక్టర్లు చేస్తున్నాడని.. నటన కూడా రొటీన్‌నే సాగుతోందని.. ఆయన్ని సరిగా వాడుకోవట్లేదనే అభిప్రాయాలున్నాయి. సందీప్ సినిమాలో కీలక పాత్ర అంటే.. ఆయనికిది మేకోవర్ లాంటి క్యారెక్టర్ కావచ్చనే అంచనాలున్నాయి. ప్రకాష్ రాజ్ పొటెన్షియాలిటీని సరిగ్గా వాడుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చేమో.

ఇంకోవైపు ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ కూడా నటిస్తున్నాడు. బహుశా అతడిది విలన్ పాత్రే కావచ్చు. చాలా ఏళ్లుగా సరైన విజయాలు లేక, హీరోగా అవకాశాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నాడు వివేక్. బాబీ డియోల్ లాగే పవర్ ఫుల్ రోల్ పడితే.. అతను సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మళ్లీ బిజీ అయిపోవడం ఖాయం.

Related Post