కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి లక్ష్మణ రేఖను విధిస్తూ.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తును ఎలా పడితే అలా వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేవలం అత్యంతకీలకమైన కేసులు.. రాష్ట్రాల పరిధిలో ఉన్న పోలీసులపై విశ్వాసం సన్నగిల్లుతున్న పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. సీబీఐకి ఇవ్వాల్సిన కేసులను సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించింది. ఆయా కేసుల్లో రాజకీయ పరిణామాలు.. కీలక నేతల హస్తం, ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం వంటివి స్పష్టంగా కనిపిస్తే.. అప్పుడే సీబీఐకి ఇవ్వాలని తేల్చి చెప్పింది.
ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని శాసన మండలిలో పనిచేసే ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారని కేసులునమోదయ్యాయి. దీనిని విచారించి రాష్ట్ర హైకోర్టు.. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. ఈ అవకతవకల నిగ్గు తేల్చేందుకు.. సీబీఐకి ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే.. ఈ కేసును రాష్ట్ర పోలీసులు నిబద్ధతతో విచారణ చేస్తున్నారని.. అలాంటి సమయంలో సీబీఐకి ఇవ్వడం ద్వారా.. వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసినట్టు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. అయినప్పటికీ.. అలహాబాద్ హైకోర్టు ఈ కేసును సీబీఐకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని రాష్ట్ర పోలీసు శాఖ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఏకేసును బడితే ఆకేసును సీబీఐకి ఇవ్వరాదని తేల్చి చెప్పింది. అత్యంత కీలకమైన కేసులు.. మెజారిటీ వర్గాలపై ప్రభావం చూపుతుందని భావించిన సమయంలోనే సీబీఐకి సదరు కేసును అప్పగించాలని సూచించింది. అంతేకాదు.. రాష్ట్రంలో రాజకీయ నేతల ప్రమేయం, అధికారుల ఉదాసీనత, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉన్నప్పుడు వాటిపై సీబీఐని వేయొచ్చని స్పష్టం చేసింది. అలా కాకపోతే.. అత్యంత కీలకమైన సీబీఐని దుర్వినియోగం చేసినట్టే అవుతుందని అభిప్రాయపడింది. అంతేకాదు..ఈ విషయంలో హైకోర్టులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను పరిశీలించాలని హితవు పలికింది.
ఏపీపై ప్రభావం..?
ఏపీలోనూ ఓ కేసును సీబీఐకి ఇస్తూ.. ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ప్రధానంగా తాడేపల్లి పోలీసులు వైసీపీ డిజిటల్ మీడియాకార్యకర్తను అరెస్టు చేశారు. అయితే.. కోర్టుకు మాత్రం అరెస్టు చేయలేదని చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు దీనిని సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఆదేశాలుజారీ చేసింది. తర్వాత.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రస్తుతం దీనిపై స్టే కొనసాగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో దీనిపై ఏమేరకు ప్రభావం పడుతుందో చూడాలి.