శిష్యులను ప్రోత్సహించంలో, వారికి అవకాశాలు కల్పించడంలో ప్రస్తుతం టాలీవుడ్లో సుకుమార్‌ను మించిన దర్శకుడు మరొకరు లేరు. మరే స్టార్ దర్శకుడి నుంచి రానంతమంది శిష్యులు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చి దర్శకులుగా మారారు. బుచ్చిబాబు సానా (ఉప్పెన), శ్రీకాంత్ ఓదెల (దసరా), సూర్యప్రతాప్ (కరెంట్), అర్జున్ (ప్రసన్నవదనం), హరిప్రసాద్ (దర్శకుడు).. ఇలా ఈ లిస్టు పెద్దగానే కనిపిస్తుంది. ఇటీవలే వీరా కోగటం అనే మరో అసిస్టెంట్‌ను సుకుమార్ దర్శకుడిగా పరిచయం చేస్తున్న సంగతి వెల్లడైంది.
హేమంత్ అనే మరో దర్శకుడు కూడా లైన్లో ఉన్నాడు. వీళ్లందరికీ సుకుమారే సినిమాలు సెట్ చేసి పెట్టాడు. శ్రీకాంత్ ఓదెల మినహాయిస్తే.. మిగతా దర్శకులందరూ సుకుమార్ బేనర్ సాయంతో దర్శకులుగా మారిన వాళ్లే. ఐతే ఇప్పుడు సుకుమార్ మరో శిష్యుడు.. ఆయన సాయం లేకుండానే డైరెక్టర్ అవుతున్నాడు.
సుకుమార్ శిష్యుల్లో దర్శకుడు కాకముందే మంచి డిమాండ్ సంపాదించి, రచయితగా పలు అవకాశాలు అందుకున్నాడు శ్రీకాంత్ విస్సా. ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలకు డైలాగ్ రైటర్ అతనే. ఆ సినిమాలు చేయకముందే అతను బయట అవకాశాలు అందుకున్నాడు. ‘డెవిల్’ సినిమాకు పని చేస్తూ నందమూరి కళ్యాణ్ రామ్‌కు అతను సన్నిహితుడిగా మారాడు.
ఈ పరిచయం వీరి కలయికలో సినిమాకు దారి తీసిందట. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తర్వాత కొత్త సినిమా చేయని కళ్యాణ్ రామ్.. తాజా శ్రీకాంత్ కథకు ఓకే చెప్పాడట. స్వీయ నిర్మాణంలో ఈ సినిమా చేయడానికి నందమూరి హీరో రెడీ అయ్యాడట. అతను మరో సినిమా కూడా చేయాల్సి ఉండగా.. దాని కంటే ముందే శ్రీకాంత్ సినిమాను మొదలుపెట్టనున్నాడట. త్వరలోనే దీని గురించి అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.