hyderabadupdates.com movies సుదీప్ అభిమానులు చాలా ఫీలయ్యారు

సుదీప్ అభిమానులు చాలా ఫీలయ్యారు

నిన్న సాయంత్రం ప్రీమియర్లతో విడుదలైన బాహుబలి ది ఎపిక్ అనుకున్నట్టే భారీ వసూళ్లతో రికార్డులను దులిపేస్తోంది. కొత్త రిలీజ్ మాస్ జాతర కన్నా దీనికే బుకింగ్స్ ఎక్కువగా ఉండటం బయ్యర్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభావం ఉంటుందని అనుకున్నారు కానీ మరీ ఈ స్థాయిలో కాదనేది వాస్తవం. రెండు భాగాలను కలిపి ఒకే పార్ట్ గా చూపించాలనే రాజమౌళి ప్రయత్నానికి అద్భుత స్పందన కనిపిస్తోంది. మూడు గంటల నలభై నాలుగు నిముషాలు అసలు బోర్ కొట్టలేదని, మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక  కిచ్చ సుదీప్ ప్రస్తావన ఎందుకో చూద్దాం.

ఎడిటింగ్ లో భాగంగా బాహుబలి ఎపిక్ లో సుదీప్ కి సంబందించిన సీన్లన్నీ కోతకు గురయ్యాయి. కట్టప్పతో చేసే సంభాషణ, ఎంత డబ్బు ఖర్చు పెట్టయినా నిన్ను బానిస విముక్తుడిని చేస్తాననే డైలాగులు ఏవీ ఇందులో లేవు. బిగినింగ్ లో వచ్చే ఈ ఎపిసోడ్ నిజానికి అసలు కథతో పెద్దగా లింక్ ఉండదు. ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవమని సుదీప్ అంటాడు తప్పించి కట్టప్ప ఆ అవకాశాన్ని వాడుకునే దిశగా కంక్లూజన్ లో కూడా ఎలాంటి సన్నివేశాలు లేవు. దీంతో సహజంగానే వాటికి కత్తెర వేశారు. ఇది సుదీప్ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. తమ హీరోవి ఎందుకు తీశారంటూ కస్సుమంటున్నారు.

దీనికి నిరసనగా ఎస్ఎస్ఎంబి 29, రాజా సాబ్ లను బ్యాన్ చేస్తామంటూ సోషల్ మీడియాలో పిలుపు ఇస్తున్నారు. అయితే వీటి ప్రభావం అంత తీవ్రంగా ఉండదు. ఎందుకంటే రాజమౌళి అంటే సుదీప్ కి విపరీతమైన అభిమానం. ఆ కారణంగానే ఈగలో విలన్ గా నటించాడు. బాహుబలిలో క్యామియో చేశాడు. ఒకవేళ తన ఫ్యాన్స్ నిజంగానే నిరసన ఎక్కువ చేస్తే వాళ్ళను శాంతపరిచే బాధ్యతను కూడా తనే తీసుకుంటాడు. అయినా ఆరు గంటలకు దగ్గరగా ఉన్న కంటెంట్ ని మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు కుదించినప్పుడు ఎన్నో కాంప్రోమైజులు జరగాలి. బాహుబలి ఎపిక్ కి సైతం ఇవి తప్పలేదు.

Related Post