hyderabadupdates.com movies సుమ ఒకప్పుడు హీరోయిన్ తెలుసా

సుమ ఒకప్పుడు హీరోయిన్ తెలుసా

టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న యాంకర్, సులభంగా డేట్లు దొరకని వ్యాఖ్యాత ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు సుమ. కేరళ నుంచి ఇక్కడికి వచ్చి సెటిలైనా స్వచ్ఛమైన తెలుగుతో ఆకట్టుకునే ఆవిడ మాట తీరు దశాబ్దాలు దాటినా అలాగే ఉండబట్టే హీరో దర్శకులు తమ వేడుకలకు ఆమెనే ఛాయస్ గా పెట్టుకుంటారు. అది మూడు కోట్లలో తీసిన చిన్న బడ్జెట్ సినిమా కావొచ్చు లేదా వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్న వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ కావొచ్చు. సుమ లేనిదే ఈవెంట్లు ప్లాన్ చేసుకోలేరు. అయితే సుమ నటిగా ఎల్లుండి విడుదల కాబోతున్న ప్రేమంటేతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా సుమ ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ కు వచ్చిందనేది కొందరికి మాత్రమే తెలిసిన విషయం. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 1996లో దర్శకరత్న దాసరి నారాయణరావుగారు తన కొత్త సినిమా కళ్యాణ ప్రాప్తిరస్తు కోసం నటీనటులు కావాలని ప్రకటన ఇచ్చారు. అప్లికేషన్లు వేలల్లో వచ్చాయి. వాటిని వడబోసి, టెస్టులు పెట్టి, ఆడిషన్లు చేస్తే ఫైనల్ గా నలుగురు మిగిలారు. వాళ్లలో ఒకరు స్టార్ రైటర్ కం నా పేరు సూర్య డైరెక్టర్ వక్కంతం వంశీ కాగా మరొకరు సుమ. షూటింగ్ వేగంగా చేశారు. ప్రేమ నేపథ్యంతో స్టోరీ కూడా టీవీ ఛానల్ బ్యాక్ డ్రాప్ లో ఉండటం గమనించాల్సిన విషయం.

థియేటర్లలో కళ్యాణ ప్రాప్తిరస్తు డిజాస్టర్ అయ్యింది. దాసరి గారి అనుభవం పని చేయలేదు. చప్పగా అనిపించిన కథా కథనాలను తిరస్కరించారు. అయితే ఎంపిక కాబడ్డ నలుగురిలో సుమ తర్వాతి కాలంలో క్రమంగా టీవీ యాంకర్ గా మారిపోయి, అటు నుంచి రాజీవ్ కనకాల జీవితంలో ప్రవేశించి, ఇప్పుడు కొడుకు రోషన్ ని హీరోగా తెరమీద చూసుకునే వరకు వచ్చింది. ఆ మధ్య జయమ్మ పంచాయితీలో టైటిల్ రోల్ చేసిన సుమకు అది కూడా చేదు ఫలితాన్ని ఇచ్చింది. మరి యాక్టర్ గా తనకున్న నెగటివ్ సెంటిమెంట్ ని ప్రేమంటే బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ఈ లవ్ స్టోరీలో సుమ పోలీస్ గా నటించింది.

Related Post