హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే సూర్య మీద తెలుగు తమిళ ప్రేక్షకుల్లో ఒక గౌరవముంది. కాకపోతే ఆ నమ్మకాన్ని బలపరిచే స్థాయిలో హిట్లు పడటం లేదు. కంగువ మరీ అన్యాయంగా ట్రోలింగ్ చవి చూడాల్సి వచ్చింది. రెండు భాగాలుగా ప్లాన్ చేసుకున్న ఈ విజువల్ గ్రాండియర్ ని ఒక్క పార్ట్ తోనే సరి పుచ్చేశారు. దీని ప్రభావం సూర్య కొత్త మూవీ కరుప్పు మీద పడుతోంది. షూటింగ్ ఆలస్యంతో పాటు థియేటర్ బిజినెస్, ఓటిటి డీల్స్ వల్ల విడుదల తేదీ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఫైనల్ గా జనవరి 23 లాక్ చేసినట్టుగా చెన్నై టాక్. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ సూర్య ఫ్యాన్స్ డిమాండ్ వేరే ఉంది.
కరుప్పు కమర్షియల్ సినిమానే అయినప్పటికీ మంచి డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు గ్రామ దేవతలకు సంబంధించిన బలమైన అంశాలు దర్శకుడు ఆర్జె బాలాజీ జోడించాడు. ఇలాంటి వాటికి సంక్రాంతి బెస్ట్ సీజన్. ఆరవ ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. కానీ సూర్య వద్దని చెప్పాడట. ఎందుకంటే తెలుగుతో పాటు సమాంతరంగా రిలీజ్ చేయాల్సిన నేపథ్యంలో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, శివ కార్తికేయన్, విజయ్ అందరికీ థియేటర్లు సర్దుబాటు చేయడమే కష్టంగా ఉంది. అలాంటిది కరుప్పు వస్తే ఈ పోటీలో నలిగిపోవడం ఖాయం. అందుకే వద్దన్నాడట.
సో రిపబ్లిక్ డేని టార్గెట్ చేసుకుని కరుప్పు రాబోతోంది. నిజానికి విజయ్ జన నాయకుడుకి జంకి పొంగల్ కి రావట్లేదేమోనని యాంటీ ఫ్యాన్స్ అనుకున్నారు కానీ దాంట్లో నిజం లేదట. పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉండటంతో హడావిడి వద్దని అనుకున్నారు. అర్థం కానీ కరుప్పు టైటిల్ తెలుగులో మార్చమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు ఏ మేరకు వింటారో చూడాలి. కార్తీ అయితే తన వా వాతియర్ ని అన్నగారు వస్తారుగా మార్పించి మంచి పని చేశాడు. మరి తమిళ వాసన గుప్పున కొడుతున్న కరుప్పుకి ఒరిజినల్ పేరే పెడతారో లేక తెలుగు వరకు మారుస్తారో చూడాలి.