విజయవాడ : పవిత్ర కృష్ణా నది తీరాన ప్రారంభమైన ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలవనుందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. విజయవాడలో జరిగిన ఈ ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కనుమరుగవుతున్న కళలు, సాహిత్యం, సినిమా, జానపద సంప్రదాయాలకు పునరుజ్జీవం కల్పించడమే ఈ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు సీఎం. ప్రతి తెలుగు ఇంటికి ఆవకాయ్‌తో ఉన్న అనుబంధం లాగే ఈ ఉత్సవం సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకం, కళా ప్రదర్శనల సమ్మేళనంగా ప్రజల మనసులను కలుపుతోందని చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ ను ప్రత్యేకంగా అభినందించారు నారా చంద్రబాబు నాయుడు.
అభివృద్ధి అనేది కేవలం ఐటీ, పరిశ్రమలకే పరిమితం కాదని అన్నారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ద్వారా కూడా ఉపాధి, అవకాశాలు సృష్టించ వచ్చని అన్నారు. కథలు, సినిమాలు, డిజిటల్ కళలే పెట్టుబడులుగా మారే ఈ దశను తాను ఆరెంజ్ రెవల్యూషన్ గా భావిస్తున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ కృష్ణా నది తీరం ఒక సాంస్కృతిక పాఠశాలగా మారనుందని చెప్పారు. 60 మందికి పైగా ప్రముఖ కళాకారులు, 40 మంది వక్తలు, 13 కళా బృందాలతో 28 ప్రత్యేక కార్యక్రమాలు, అంతర్జాతీయ వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నామని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్.
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానం 2024–29 ద్వారా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం జరిగిందని చెప్పారు. దీని వల్ల పెట్టుబడులు పెరిగి, పర్యాటకం కొత్త దిశలో సాగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన జానపద కళలు, సాంస్కృతిక రంగాలను నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే కోహినూర్ వజ్రం లాంటిదని అన్నారు కందుల దుర్గేష్. ప్రతి నదికి ఒక కథ, ప్రతి కళకు ఒక ఆత్మ ఉంది. రాష్ట్రాన్ని ప్రపంచ సృజనాత్మక రాజధానిగా మార్చేందుకు అందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
The post సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ద్వారా ఉపాధి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ద్వారా ఉపాధి
Categories: