ఒక సన్నివేశం మరింత ప్రభావవంతంగా ఉండేందుకు.. ఎమోషన్ బాగా పండడం కోసం.. ఆర్టిస్టులు పాత్రల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే ఏడ్చేయడం.. కొట్టేయడం లాంటివి జరుగుతుంటాయి. తాను కథానాయికగా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంలో అలాగే జరిగిందని అంటోంది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా.
ఈ సినిమాలో తనకు జోడీగా నటించిన తరుణ్ భాస్కర్.. తనను నిజంగానే చెంపదెబ్బ కొట్టినట్లు ఆమె వెల్లడించింది. ఈషాను తరుణ్ చెంపదెబ్బ కొడితే.. ముఖం మీద పిండి అచ్చు కూడా పడే షాట్ ఒకటి ఈ మూవీ ట్రైలర్లో చూడొచ్చు. ఆ సీన్లో నిజంగానే తాను చెంపదెబ్బ తిన్నట్లు ఈషా చెప్పింది. ఈ సీన్ ఎఫెక్టివ్‌గా ఉండేందుకు దర్శకుడి సూచన మేరకు తరుణ్ అలా చేశాడని ఆమె చెప్పింది.
అందుకు తాను కూడా ఓకే చెప్పానంది. ఆ సీన్లో దెబ్బ కొంచెం గట్టిగానే తగిలిందని.. దీంతో తనకు ఏడుపు కూడా వచ్చాయని.. సినిమాలో కనిపించే తన కన్నీళ్లు నిజమైనవే అని ఆమె వెల్లడించింది.
మలయాళ హిట్ మూవీ జయ జయ జయ జయహేకు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ మూవీ తనకు ఎంతగానో నచ్చిందని.. అందులో హీరోయిన్ తరహా పాత్రను కెరీర్లో ఒక్కటైనా చేయాలని తాను అనుకున్నానని.. అదే పాత్రను చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈషా చెప్పింది.
ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ మూవీ అయినప్పటికీ.. కథలో చాలా మార్పులు చేశారని.. సినిమా చూసిన ఎవ్వరికీ ఇది రీమేక్ అనే ఫీలింగ్ రాదని ఈషా పేర్కొంది. తన బామ్మ వాళ్ల ఊరు రాజమండ్రే కావడం, తరచూ అక్కడికి వెళ్లడం వల్ల తనకు గోదావరి యాసలో డైలాగులు చెప్పడం పెద్దగా ఇబ్బంది కాలేదని.. కానీ పక్కా తెలంగాణ యాసలో మాట్లాడే తరుణ్ భాస్కర్‌కు మాత్రం ఆ స్లాంగ్‌లో డైలాగులు చెప్పడం చాలా కష్టమైందని.. అందుకోసం అతనెంతో కసరత్తు చేశాడని ఈషా చెప్పింది.
ఈ మధ్య తెలుగులో తన సినిమాలు తగ్గిన మాట వాస్తవమే అని.. అది అనుకోకుండా వచ్చిన గ్యాప్ అని.. ఇకపై వరుసగా సినిమాలు చేస్తానని.. తమిళంలో కూడా ఒక సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని ఈషా వెల్లడించింది.