hyderabadupdates.com movies అనుకోని విప‌త్తులు: ఏపీకి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ట్లేదుగా!

అనుకోని విప‌త్తులు: ఏపీకి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ట్లేదుగా!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడిన త‌ర్వాత‌.. సుప‌రిపాల‌న అందించేందుకు.. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌న్న విధానంతో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది. అయితే.. స‌ర్కారుకు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని విధంగా ప్ర‌కృతి విప‌త్తులు, మాన‌వ త‌ప్పిదాలు జ‌రుగుతున్నాయి. దీంతో ఇటు ప్ర‌జ‌ల‌కు.. అటు స‌ర్కారుకు కూడా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌న్న‌ది వాస్త‌వం.

వ‌ర‌ద‌లు.. వ‌ర్షాలు.. తుఫాన్లు వంటివి కామ‌న్‌గా వ‌స్తాయి. వీటిని అడ్డుకునే ప్ర‌య‌త్నం ఎవ‌రూ చేయ‌లేరు. కానీ, న‌ష్టం రాకుండా.. ప్ర‌జ‌ల‌కు క‌ష్టం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుని విప‌త్తుల నుంచి బ‌య‌ట ప‌డొచ్చు. ప్ర‌భుత్వం దీనినే అనుస‌రిస్తోంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు తుఫాన్లు వ‌చ్చినా.. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. ఆస్తులు, పొలాలు.. పంట‌లు, ఇళ్లు వంటివాటికి న‌ష్టం వాటిల్లింది. దీనికి సంబంధించిన ప‌రిహారం ప్ర‌భుత్వం ఇస్తోంది.

ఇక‌, మాన‌వ త‌ప్పిదాల కారణంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. కొన్ని ఉన్నాయి. గ‌త ఏడాది వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల స‌మ‌యంలో తిరుప‌తిలో ఏర్పాటు చేసిన టోకెన్ల క్యూలైన్ల‌లో తొక్కిస‌లాట జ‌రిగింది. అప్ప‌ట్లో ఆరుగురు మృతి చెందారు. ఇది పూర్తిగా అధికారుల అల‌స‌త్వం, ముంద‌స్తు వ్యూహం కొర‌వ‌డిన కార‌ణంగానే జ‌రిగింద‌ని నివేదిక‌లు తేల్చాయి. దీంతో ఇద్ద‌రు అధికారుల‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేశారు.

ఆ త‌ర్వాత‌.. సింహాద్రి అప్ప‌న్న చంద‌నోత్స‌వ స‌మ‌యంలో పిట్ట‌గోడ కూలిపోయి.. భ‌క్తుల‌ పై పడిన ఘ‌ట‌న‌లో ఏడుగురు భ‌క్తులు మృతి చెందారు. ఈ విష‌యంలోనూ ఆల‌య అధికారుల త‌ప్పులు ఉన్నాయ‌ని గుర్తించిన ప్ర‌భుత్వం వారి పై చ‌ర్య‌లు తీసుకుంది. ఇక‌, ఇటీవ‌ల క‌ర్నూలులో చోటు చేసుకున్న బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న కూడా.. తీవ్రంగా క‌ల‌చి వేసింది 19 మంది కాలి బుగ్గ‌య్యారు. ఇక‌, ఇప్పుడు కాశీబుగ్గ ఘ‌ట‌న‌.. కూడా ఓ ప్రైవేటు వ్య‌క్తి నిర్ల‌క్ష్యం కార‌ణంగా చోటు చేసుకుంద‌ని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఆయా ఘ‌ట‌నలు.. ఇటు ప్ర‌భుత్వాన్ని, అటు ప్ర‌జ‌ల‌ను కూడా ఊపిరి తీసుకోలేనంతగా బాధిస్తున్నాయ‌నే చెప్పాలి.

Related Post