ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. .కేరళ నుంచి పలువురు అభిమానుల సూచనలు.. అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని.. ఆ రాష్ట్రంలోనూ విస్తరించేలా ప్రణాళికలు చేశారు. ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సారథ్యంలో ఓ బృందం ఆదివారం కేరళ రాజధాని తిరువనంతపురం వెళ్లి.. పార్టీలో చేరికలను ఆహ్వానించింది. వివిధ పార్టీలకు చెందిన దాదాపు 200 మందికి జనసేన కండువా కప్పి.. పార్టీలో చేర్చుకున్నారు.
కీలక పార్టీల నుంచే రాక..
నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, హిందుస్థాన్ అవమీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుండి దాదాపు 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వీరికి నాగబాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగబాబు.. వారికి జనసేన పార్టీ కార్యక్రమాల్లో అనుసరించే విధానాలను, సిద్ధాంతాలను వివరించారు.
బలమైన నాయకులే!
జనసేనలో చేరిన వారిని పరిశీలిస్తే.. స్థానికంగా వారికి బలమైన రాజకీయనేపథ్యం కనిపిస్తోంది. కేరళలోని అట్టింగల్ నియోజకవర్గం నుండి కె. డాన్సీలన్, పి. రామసాగర్, త్రివేండ్రం నియోజకవర్గం నుండి ఎస్.కె. దిలీప్ కుమార్, కాలికట్ నియోజకవర్గం నుండి జోషి అథోలి, బిజు కె మావూర్, కొచ్చి నియోజకవర్గం నుండి ఎం.కె. అంబేద్కర్, త్రిశూర్ నియోజకవర్గం నుండి టోమ్ వర్గీస్, కె, బెస్సీ థామస్, మోహన్‌దాస్, ఫణికేర్, మలప్పురం నియోజకవర్గం నుండి ఎం. సునీల్ కుమార్, మహ్మద్ రైసుద్దీన్, కె.ఎం. ఆడమ్ మాలిక్, కె. శ్రీజ, వయనాడ్ నియోజకవర్గం నుంచి అనిల్ ఎస్ నాయర్, ఎర్నాకులం నియోజకవర్గం నుండి సౌమ్య ఉన్ని కృష్ణన్ తదితర ముఖ్య నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరంతా ఆయా పార్టీల తరఫున బలమైన నాయకులుగా ఎదిగారని.. అయితే.. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారని.. ఈ సందర్భంగా నాగబాబు తెలిపారు.
సిద్ధాంతమే ప్రాణం: నాగబాబు
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్దకాలం పాటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ప్రత్యక్షంగా చేపడుతున్న సేవలు, అభివృద్ధి పనులను నాగబాబు వివరించారు. ముఖ్యంగా పార్టీకి సిద్ధాంతమే ప్రాణమని తెలిపారు. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా జనసేన సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటాయని, రాజకీయంగా స్థానిక అంశాలు, సమస్యలకు అనుగుణంగా పార్టీ విధి, విధానాలు ఉంటాయని అన్నారు. పవన్ భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతంగా దేశస్థాయిలో ప్రజలను ఆకట్టుకుంటోందని తెలిపారు.