అమరావతి : క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర సృష్టించిందని అన్నారు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాకినాడలో రూ.13 వేల కోట్లతో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు కావడం శుభసూచకం అన్నారు. 495 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ ద్వారా 2,600 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు బీసీ జనార్దన్ రెడ్డి. దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా ఈ ప్లాంట్ నిలవడం ఆంధ్రప్రదేశ్ కే గర్వ కారణం అని అన్నారు. ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని పేర్కొన్నారు బీసీ జనార్దన్ రెడ్డి.
పర్యావరణ అనుకూల విధానాలు, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ ప్రాజెక్టు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఉంటుందన్నారు. కాకినాడ పోర్ట్‌కు కేవలం 1 కి.మీ దూరంలో ప్లాంట్ ఉండటంతో వ్యూహాత్మకంగా ప్రపంచ స్థాయి ఎగుమతులకు గొప్ప అవకాశంగా మారుతుందని చెప్పారు బీసీ జనార్దన్ రెడ్డి. పెట్టుబడిదారులకు అనుకూల విధానాలతో, అన్ని విధాలుగా తమ ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వంపై నమ్మకంతో ఏపీకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రం మారుతోందని, ఈ సందర్బంగా అభినందించారు బీసీ జనార్దన్ రెడ్డి.
ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వచ్చారని తెలిపారు. హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాలు పండగ కోసం ఏపీకి వచ్చాయని అన్నారు సీఎం. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించారని ప్రశంసలు కురిపించారు. ఇందుకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు.
The post క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర
Categories: