హైదరాబాద్ : ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభకు ఒక్కరిని కూడా ఎంపిక చేయకుండా మోసం చేశారని వాపోయారు. రాబోయే రోజుల్లో మాదిగలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. లోక్ సభ లో మాదిగలకు ప్రాతినిధ్యం లేదన్నారు . ప్రస్తుతం రాజ్యసభకు సైతం మాదిగలను ఎంపిక చేయక పోవడం బాధాకరం అన్నారు మందకృష్ణ మాదిగ. తన రాజకీయ జీవితంలో మాదిగలు అన్ని వేళలా అండగా ఉన్నారని చెబుతున్న రేవంత్ మాదిగలను రాజకీయంగా పథకం ప్రకారం అణిచి వేస్తున్నారని ఆరోపించారు. మాదిగలను మభ్య పెట్టీ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేతకు గురిచేస్తూ వచ్చిందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగలకు లోక్ సభ, రాజ్య సభలలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ లో వివక్షకు గురవుతున్నారని ధ్వజమెత్తారు ఎంఆర్పీఎస్ చీఫ్. తన స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డికి సీటు ఇప్పించడం దారుణమన్నారు. ఇదంతా అగ్రవర్ణాల కుట్ర తప్ప మరోటి కాదన్నారు. ఈ ఎంపిక ద్వారా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తన సహజత్వాన్ని చాటుకుందని మరోసారి నిరూపితమైందని మండిపడ్డారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట పై నిలబడలేదని అన్నారు. గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేస్తామని అన్నారని, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదన్నారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు 9 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలల ఒత్తిడికి తలొగ్గి రేవంత్ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
The post మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Categories: