అమరావతి : రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇందులో భాగంగా ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియోను అనుసరించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, మెట్రిక్ టన్నుకు సగటున రూ.19,579 ధర లభించిందని చెప్పారు. ఇది గత 10 సంవత్సరాల్లో అత్యధిక సగటు ధరగా నమోదు అయిందని తెలిపారు మంత్రి. ఇప్పటి వరకు రూ.18,128.48 లక్షల నిధులు విడుదల చేశామన్నారు. అందులో రూ.13,425.02 లక్షలు నేరుగా రైతుల ఖాతాల్లో వేశామన్నారు అచ్చెన్నాయుడు . ఇప్పటివరకు 24,130 హెక్టార్లలో కొత్త ఆయిల్ పామ్ విస్తరణ సాధించామని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర రైతులకు గరిష్ట లాభాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ధరలు పడిపోతున్న సమయంలో రైతులకు భరోసా ఇవ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత నెగిటివ్ స్టేట్‌మెంట్స్ ఇస్తూ రైతుల జీవితాలతో ఆడుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదని తెలిసి కూడా, ధరలు పడిన ప్రతిసారి మరింత భయం కలిగించే వ్యాఖ్యలు చేస్తూ మార్కెట్‌ను ఇంకా పతనమయ్యేలా చేశారని ఆరోపించారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ధరలు పడుతున్న సమయంలో ఏ రాజకీయ నేత అయిన రైతుల వెన్నంటి ఉండాల్సి ఉండగా, జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయ లాభం కోసం రైతుల భవిష్యత్తుతో చెలగాటం ఆడారని మండిపడ్డారు.
రైతులకు భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడం వలననే నేడు మిర్చి, పామాయిల్ ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు. రైతులు సంతోషంగా ఉన్నారని, ఇదే కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. పామాయిల్ పంటలను మరింత ప్రోత్సహించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌లో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి డ్రిప్ ఇరిగేషన్ రాయితీలను ఎగ్గొట్టి రైతులను నిరాశపరిచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది లక్ష హెక్టార్లకు పైగా డ్రిప్ ఇరిగేషన్‌ను అమలు చేస్తూ రైతులను ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ఇది వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక మార్పులకు దారితీస్తుందని స్పష్టం చేశారు. రైతుల ఆదాయం పెరగడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ధరల స్థిరత్వం, సాగు ఖర్చుల తగ్గింపు, ఆధునిక పద్ధతుల అమలే తమ విధానమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు మాటలతో కాదు, చర్యలతో మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఆయన తేల్చిచెప్పారు.
The post రైతులకు స్థిర ఆదాయం సర్కార్ లక్ష్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
రైతులకు స్థిర ఆదాయం సర్కార్ లక్ష్యం
Categories: