మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మశ్రీ ఒకటి. కళలు, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లోని వ్యక్తులు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంది.
గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే2026 ఏడాదికి 45 మందిని పద్మశ్రీ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. అందులో, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఉన్నారు.
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చీఫ్ సైంటిస్ట్ గా, సీడీఎఫ్ డీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ను పద్మశ్రీ వరించింది. జన్యుసంబంధ పరిశోధనలకు గాను ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
జన్యు సంబంధిత పరిశోధనల్లో తంగరాజ్ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ జనాభా జన్యు వైవిధ్యం, దక్షిణ ఆసియా ప్రజల పూర్వీకుల మూలాలను కనుగొనడం, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల నిర్ధారణ వంటి విషయాల్లో ఆయన చేసిన పరిశోధనలు, అధ్యయనాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.
మరోవైపు, తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కింది. పాడి, పశుసంవర్ధక విభాగాల్లో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపు లభించింది. కర్ణాటకకు చెందిన అంకె గౌడకు సాహిత్యం, విద్య రంగాల్లో పద్మశ్రీ దక్కింది.
అన్‌సంగ్ హీరోస్ కేటగిరీలో మధ్యప్రదేశ్‌కు చెందిన భగవదాస్ రైక్వార్, జమ్మూకశ్మీర్‌కు చెందిన బ్రిజ్ లాల్ భట్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బుద్రీ థాటి, ఒడిశాకు చెందిన చరణ్ హెంబ్రామ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన చిరంజీ లాల్ యాదవ్, గుజరాత్‌కు చెందిన ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్యాకు పద్మశ్రీ అవార్డు లభించింది.
వీరితో పాటు ఎస్ జీ సుశీలమ్మ, శ్యామ్ సుందర్, చిరంజి లాల్ యాదవ్, ఇంద్రజీత్ సింగ్, రఘువత్ సింగ్, ఆర్. కృష్ణన్, పద్మ గుర్మిత్, అంకె గౌడ, ఆర్మిడ ఫెర్నాండెజ్, భ్రిజ్ లాల్ భట్, భగవాన్ దాస్ రైకర్, టెక్కీ గుబిన్, సురేష్ హనగవాడి, సిమాంచల్ పాత్రో, విశ్వ బంధు, శ్రీరంగ్ దేవబ లాడ్, కాలియప్ప గౌండర్,పోఖిల లేఖేపి, నూరుద్దీన్ అహ్మద్, నరేష్ చంద్ర దేవ్ వర్మ తదితరులకు పద్మశ్రీ అవార్డు దక్కింది.