రామ్ గోపాల్ వర్మ ఒక దశ దాటాక దర్శకుడిగా ఫామ్ కోల్పోయి వరుసగా ఫ్లాపులు ఇచ్చినా సరే.. చాలామంది ఫ్యాన్స్‌లో ఆయన మీద అభిమానం తగ్గలేదు. ఆయన సినిమాలకే అంకితమై ఉన్నపుడు ఫాంతో సంబంధం లేకుండా ఆయన మీద అభిమానం కొనసాగింది. కానీ వైసీపీతో తెరచాటు ఒప్పందం చేసుకుని.. రాజకీయ మకిలి అంటించుకున్నాక ఆయన మీద విపరీతమైన నెగెటివిటీ మొదలైంది.
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు ఉండకూడదా.. వాళ్లు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేయకూడదా అంటే అదేమీ కాదు. కానీ వర్మ ఓపెన్‌గా ఆ పని చేసి ఉంటే ఇబ్బంది లేదు. కానీ తెరచాటు ఒప్పందాలు చేసుకుని.. తన స్థాయికి ఏమాత్రం తగని ప్రాపగండా సినిమాలు చేయడం, వైసీపీ రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా ఆర్జీవీ పతనం అయిపోయాడు. ఐతే 2024 ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయాక ఆయనకు జ్ఞానోదం అయింది. తనకు, రాజకీయాలకు సంబంధం లేదని.. ఇంకెప్పుడూ అటు వైపు చూడనని తేల్చేశాడు.
ఇప్పుడు రాజకీయాల ప్రస్తావన తెస్తే చాలు.. దండం పెట్టేస్తున్నాడు వర్మ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాల గురించి అడిగితే.. అన్నింటికీ నో అనే సమాధానం ఇచ్చాడు వర్మ. మీరు పుట్టింది విజయవాడనే కదా, మరి ఏపీ ఇప్పుడు ఎలా ఉంది.. అక్కడ రాజకీయాల గురించి మీరేం అంటారు అంటే.. తనకు దాని గురించి ఏమీ తెలియదని, తాను దానిపై ఏమీ మాట్లాడనని తేల్చేశాడు వర్మ. ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాలు, దానికి సంబంధించిన విషయాల మీదే అని వర్మ చెప్పాడు.
చంద్రబాబు గురించి మీరేమంటారు అంటే.. తన జీవితంలో ఎప్పుడూ ఆయన్ని కలవలేదని.. రాజకీయంగానే కాక వ్యక్తిగతంగా కూడా ఆయన గురించి ఏమీ తెలియదని అన్నాడు వర్మ. మరి జగన్ సంగతేంటి అంటే.. వ్యక్తిగతంగా ఆయన తనకు ఇష్టమన్నాడు. తాను జగన్‌ను కలిశానని చెప్పాడు. తన తండ్రి మరణానంతం జగన్ బలంగా నిలబడి.. తనను తాను మలుచుకున్న విధానం, ఎదిగిన తీరు తనకు నచ్చుతాయన్నాడు. జగన్‌లో తనకు నచ్చే క్వాలిలీ ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్ అని వర్మ చెప్పాడు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తనకు ఇష్టమని.. రాజకీయంగా ఆయన గురించి తనకేమీ తెలియదని చెప్పాడు వర్మ. బాలయ్య గురించి అడిగితే.. ఆయన్ని ఎప్పుడూ కలవలేదని.. ఎప్పుడో 30 ఏళ్ల ముందు తప్పితే ఆయన సినిమాలు చూసింది లేదని.. ఆయన తరహా సినిమాలు తనకు నచ్చవని.. తన అభిరుచి వేరని.. చిరంజీవి విషయంలోనూ అంతే అని వర్మ తేల్చేశాడు.