తన సోదరుడు కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా చేయాలని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేటీఆర్ కు కవిత కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ గారు వచ్చి సికింద్రాబాద్ ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్.. జిల్లా చేయాలని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కేటీఆర్ ఈ రోజు ఈ మాట అనడం హాస్యాస్పదమని అన్నారు.
ఇక, ట్యాంక్ బండ్ పై ఆంధ్రావాళ్ళ విగ్రహాలు తీసేయాలంటూ చాలాకాలంగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వ్యవహారంపై కూడా కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్యాంక్ బండ్ పై ఆంధ్రవాళ్ల విగ్రహాలు తీసివేయాలని తాను చెప్పడం లేదని, కానీ సమయం వచ్చినప్పుడు ఆ పని చేయవచ్చని కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు పెట్టాలని, తెలంగాణకు చెందిన మహనీయుల విగ్రహాలు అక్కడ ఉండాలని అన్నారు.
ఇక, ఫోన్ ట్యాపింగ్ విచారణ నేపథ్యంలో హరీశ్ రావు సిట్ విచారణకు హాజరైన విషయంపై కూడా కవిత పరోక్షంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గుంపు మేస్త్రి గారు, గుంటనక్క గారు కలిసి ఆడుతున్న నాటకం అని పరోక్షంగా రేవంత్ రెడ్డిని, హరీశ్ రావును ఉద్దేశించి చురకలంటించారు.
ఆ విచారణ వల్ల తనవంటి బాధితులకు న్యాయం జరగదని కవిత అన్నారు. ట్యాంక్ బండ్ పై ఆంధ్రావాళ్ల విగ్రహాలు తీసేయాలని కవిత చేసిన కామెంట్లపై ఆంధ్రా నాయకుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే, కవిత వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదే ట్యాంక్ బండ్ పై ఆంధ్రా నాయకుల విగ్రహాలు తీసేయకుండా తెలంగాణ నాయకుల విగ్రహాలు కూడా పెట్టవచ్చని అంటున్నారు. మనసుంటే మార్గం ఉంటుందని, ఎన్నో ఏళ్లుగా ఉంటున్న విగ్రహాలు తీసి విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నారు.
“ట్యాంక్ బండ్ లో ఆంధ్రా వాళ్ళ విగ్రహాలు తీసెయ్యాలని నేను చెప్పను కానీ… సమయం వచ్చినప్పుడు ఆ పని చేయొచ్చు.అక్కడ తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు పెట్టాలి.”– #Kavitha pic.twitter.com/eFwcd4sNFx— Gulte (@GulteOfficial) January 21, 2026