తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొత్తంగా మూడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికలలో తొలి విడత పోలింగ్ జరగనున్న పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. అయితే.. అనుకున్న విధంగా నామినేషన్లు రాకపోవడం గమనార్హం. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది.
తీరా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక పెద్దగా ఆ ఊసు కనిపించడం లేదు. ఆ ఊపు కూడా లేకుండా పోయింది. దీనికి కారణం.. ఎక్కువగా ఏకగ్రీవాలు చేసుకునే విషయంపైనే అధికార పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాలతో పాటు.. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ , మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలలోని గ్రామాల్లో కూడా.. ఏకగ్రీవాలకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. దీంతో నామినేషన్ల సందడి పెద్దగా కనిపించడం లేదు.
అయితే.. నామినేషన్లు అసలు లేవని కాదు.. కానీ, ఆశించిన స్థాయిలో అయితే కనిపించడం లేదు. తొలి రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచి పదవుల కోసం 4,900 నామినేషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి ఈ సంఖ్య 10 వేలు ఉంటుందని ముందుగానే అంచనా వేసుకున్నా.. అది చేరలేదు. ఇక, రెండో రోజు శుక్రవారం కూడా ఈ ప్రక్రియ మందకొడిగానే సాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు శనివారంతో తొలి దశ పోలింగ్ జరగనున్న గ్రామాలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తి కానుంది.
దీంతో ఆశించిన విధంగా అయితే.. నామినేషన్లు దాఖలు చేయడం లేదని తెలుస్తోంది. పంచయతీ పరిధి లో ఏకగ్రీవాలను చేయడం ద్వారా కాంగ్రెస్ నాయకులు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు పంచాయతీ సర్పంచ్ పదవులకు వేలం వేస్తున్న విషయం తెలిసిందే. దీంతో నామినేషన్ల హడావుడి ఆశించిన మేరకు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.