హైదరాబాద్ : ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజా సేవతో పాటు క్రీడలపై కూడా ఫోకస్ పెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్‌బీ స్టేడియం మళ్లీ క్రీడాస్ఫూర్తికి వేదికగా ప్రజాప్రతినిధుల సందడితో కోలాహళంగా మారడం పట్ల సంతోషంగా ఉందన్నారు. నాయకులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. “Fit Leaders – Fit State” సందేశంతో “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్” క్రీడలు ఆద్యంతం ఉత్సాహ భరితంగా ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించే శాసన మండలి, శాసనసభ సభ్యులకు 14 సంవత్సరాలుగా నిలిచి పోయిన క్రీడా సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి తిరిగి ప్రారంభించారు. ప్రారంభించడమే కాకుండా సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పలు క్రీడల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని కలిగించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర క్రీడాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ లాల్ బహదూర్ స్టేడియం కు గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రపంచంలోనే పేరు పొందిన క్రీడాకారులు ఈ మైదానంలో ఆడటమే కాకుండా శిక్షణ పొందారని తెలిపారు. ఈ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం అన్నారు. అలాగే గచ్చీబౌలిలో ఉన్న క్రీడా మైదానాలను రూ. 700 కోట్లతో ప్రపంచ స్థాయి క్రీడా వసతులతో అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు సీఎం.
గచ్చీబౌలీలో 2034 లో ఒలింపిక్స్ నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం అన్నారు. 3 నెలల్లో అక్కడ పనులను ప్రారంభించ బోతున్నామని తెలిపారు సీఎం. వచ్చే మూడేళ్లలో క్రీడలన్నింటినీ గచ్చీబౌలి క్రీడా మైదానాల్లో నిర్వహించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం అని తెలిపారు. బేగంపేట హాకీ మైదానాన్ని కూడా అభివృద్ధి చేస్తాం అన్నారు. ఒకప్పుడు హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్ మన రాష్ట్రానికి నగరానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయని తెలిపారు. ఇప్పుడు క్రీడల్లో వెనకబడ్డాం. యువతీయువకుల్లో క్రీడాస్ఫూర్తిని కలిగిస్తూ క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలు పూర్తిగా కనుమరుగయ్యాయని ఆరోపించారు. మంచి పాలన అందించాలంటే ప్రభుత్వానికి విధి విధానాలు ఉండాలన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడా పాలసీని తీసుకొచ్చాం అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను నిర్వహించాం అన్నారు.
140 కోట్ల జనాభా కలిగి ఉన్నప్పటికీ దేశం నుంచి ఎంట్రీ స్థాయిలో కూడా క్వాలిఫై కాలేక పోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో సౌత్ కొరియా 30 స్వర్ణ పతకాలు సాధిస్తే, అందులో 16 గోల్డ్ మెడల్స్ అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీ దక్కించుకుందన్నారు.. దక్షిణ కొరియాకు ఉన్న పట్టుదల మనకు లేక పోవడం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు సీఎం. క్రీడాస్పూర్తిని పెంచాలన్న ఉద్దేశంతోనే ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించాం అన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థినీ విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందన్నారు. క్రీడలపైన ఆసక్తి పెంచుకోవాలి. రాణించాలని పిలుపునిచ్చారు.
The post ప్రజా ప్రతినిధులు క్రీడలపై ఫోకస్ పెట్టాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ప్రజా ప్రతినిధులు క్రీడలపై ఫోకస్ పెట్టాలి
Categories: