బలమైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్ గతంలో నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సీరియస్ సినిమాలు చేశాడు కానీ ఇప్పటిదాకా టచ్ చేయని జానర్ హారర్ ఒకటే. త్వరలో అది కూడా తీర్చుకోబోతున్నాడు. 12ఏ రైల్వే కాలనీ ఈ నెల 21 విడుదల కానుంది. పొలిమేర సిరీస్ సృష్టికర్త డాక్టర్ అనిల్ విశ్వనాథ్ రచనతో పాటు పర్యవేక్షణ చేసిన ఈ క్రైమ్ డ్రామాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చడం మరో ఆకర్షణ. ఇవాళ జరిగిన ట్రైలర్ లాంచ్ లో కాన్సెప్ట్ తో పాటు స్టోరీ ఎంతో చెప్పే ప్రయత్నం చేసి ట్విస్టులను రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు.
జాలీగా తిరిగే యువకుడి (అల్లరి నరేష్)కి అనూహ్యమైన కలలు వస్తుంటాయి. వాటి వెనుక రహస్యం ఏంటో అంతు చిక్కదు. ఒక విచిత్రమైన నేరంలో దోషులను వెతుకుతున్న పోలీస్ ఆఫీసర్ (సాయికుమార్) కు ఇతని సహాయం అవసరమవుతుంది. ముందు అనుమానంతో వెనుకడుగు వేసినా తనకొచ్చిన కలకు దీనికి ఏదో కనెక్షన్ ఉందని భావించి ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో హత్యలు చేస్తున్న ఒక వ్యక్తి (జీవన్ కుమార్) మీద అనుమానం మొదలవుతుంది. అసలు ఆ క్రైమ్ ఏంటి, ఎప్పుడూ డిపార్ట్ మెంట్ చూడనంత మలుపులు అందులో ఏమున్నాయో తెలియాలంటే థియేటర్లలో వెళ్లాల్సిందే.
విజువల్ గా ట్విస్టులు చాలానే పెట్టిన దర్శకుడు నాని, రచయిత విశ్వనాథ్ ముఖ్యమైన డీటెయిల్స్ ట్రైలర్ లో ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అల్లరి నరేష్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. గమ్యంలో గాలోడుకి పెద్ద బాధ్యత తలమీద పడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో 12ఏ రైల్వే కాలనీ పునాది వేసుకుంది కాబోలు. బీజీఎమ్, కెమెరా వర్క్ రెండూ బాగున్నాయి. అయితే ఓటిటిలో ఎక్కువగా అలవాటు పడ్డ ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ తో వెండితెరపై మెప్పించడం సవాలే. అందులోనూ అల్లరి నరేష్ ఇలాంటి టర్న్ తీసుకోవడం ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది.