హీరో రెండో భార్యను మొదటి భార్య పొగిడితే..

ఒక వ్యక్తికి విడాకులై రెండో పెళ్లి చేసుకుంటే.. మొదటి భార్య, రెండో భార్య మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం అన్నది దాదాపు అసాధ్యం అనదగ్గ విషయం. ఫిలిం సెలబ్రెటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఐతే తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుటుంబంలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితిని చూడొచ్చు.

శరత్ మొదటి భార్య ఛాయాదేవి, తన సంతానంతో.. రెండో భార్య రాధికకు, ఆమె సంతానానికి చాలా మంచి సంబంధాలున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి వీళ్లందరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. రాధిక గురించి వరలక్ష్మి, వరలక్ష్మి గురించి రాధిక ఎప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉంటారు.

దాని కంటే విశేషం ఏంటంటే.. రాధిక మీద ఛాయాదేవికి ఎంత అభిమానం ఉంది అన్నది తాజాగా ఒక ఈవెంట్లో వెల్లడైంది. వరలక్ష్మి లీడ్ రోల్ చేయడమే కాక దర్శకత్వం వహించిన ‘సరస్వతి’ సినిమా తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు శరత్ కుమార్‌తో పాటు ఛాయాదేవి, రాధిక హాజరు కావడం విశేషం. అంతే కాక ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమను చాటారు.

ఛాయాదేవి స్టేజ్ మీద మాట్లాడుతూ.. తాను గతంలో దూరదర్శన్‌లో యాంకర్‌గా పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా చాలా స్పెషల్ మూమెంట్ అని చెబుతూ, తాను రాధికను ఇంటర్వ్యూ చేశానన్నారు. ఆ అనుభవం గురించి ఆమె స్పందించిన తీరు రాధిక మీద ఆమెకు ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో చాటుతుంది.

అలాగే ఇటీవలే విడుదలై రాధికకు ప్రశంసలు తెచ్చిపెడుతున్న ‘తాయ్ కెళవి’ సినిమా గురించి కూడా ఆమె గొప్పగా మాట్లాడారు. ఛాయాదేవి తన గురించి మాట్లాడుతున్నపుడు రాధిక కూడా ఎంతో సంతోషంగా కనిపించారు. ఛాయాదేవి పట్ల తన ప్రేమనూ చాటుకున్నారు. ఆ సమయంలో వరలక్ష్మి కూడా ఎంతో ఎగ్జైట్ అయింది.

తర్వాత రాధిక మాట్లాడుతూ వరలక్ష్మి మీద ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగులో వచ్చి ఎక్కువ సినిమాలు చేయమని, ఇక్కడి వాళ్లు హీరోయిన్లను ఎంతో సెలబ్రేట్ చేస్తారంటూ వరలక్ష్మికి తనే సలహా ఇచ్చానని ఆమె వెల్లడించారు. తన ప్రతిభను కొనియాడారు. శరత్ కుమార్ తన మాజీ భార్య, ప్రస్తుత సతీమణితో కలిసి ఈ ఈవెంట్‌కు రావడమే విశేషం అంటే.. వాళ్లిద్దరూ ఇంత అన్యోన్యంగా కనిపించడం చూసేవాళ్లను అమితంగా ఆకట్టుకుంది.

More From Author

Chiranjeevi’s Mana ShankaraVaraPrasad Garu Completes 50 Days in 109 Centres, Marks Rare Box Office Feat

హరీష్‌ను పవన్ కొట్టింది అందుకా…