ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ఎదిగినా కాస్తయినా గర్వం తలకెక్కని నటుడు ప్రభాస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని వంటబట్టించుకుని అందరితోనూ ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు రెబల్ స్టార్. ప్రభాస్ ఎంత సింపుల్‌గా ఉంటాడు.. తోటి ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఎలా గౌరవిస్తాడు అన్నది తనతో పని చేసిన వాళ్లు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు.
తాజాగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. ప్రభాస్ ప్రత్యేకత గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాలో రాహుల్ ఒక కీలక పాత్ర చేశాడట. ఈ పాత్ర కోసం అతను పూర్తిగా అవతారం మార్చేశాడట. జుట్టు, గడ్డం తెల్లబడి కనిపిస్తాడట రాహుల్. ఈ పాత్రలో ప్రభాస్‌తో కలిసి నటించిన అనుభవం గురించి అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
ఒక రోజు ఉదయం తనకు ప్రభాస్‌తో కాంబినేషన్ సీన్ షూట్ చేశారని.. సెట్‌కు వచ్చిన ప్రభాస్ కాస్త దూరంలో నిలబడగా.. కాసేపటికి తాను, అతను ఒకరినొకరు చూసుకుని ఒకేసారి నమస్కారం పెట్టుకున్నట్లు రాహుల్ తెలిపాడు. తర్వాత దర్శకుడు హను తమ మీద సన్నివేశం షూట్ చేశారన్నాడు. ఐతే షూట్ అయ్యాక దర్శకుడు హను దగ్గరికి వెళ్లి.. ఈ ఆర్టిస్టును ఎక్కడో చూసినట్లు ఉంది, ఎవరు అని అడిగాడట ప్రభాస్. దానికి హను బదులిస్తూ.. తను రాహుల్ రవీంద్రన్, నా తొలి సినిమా ‘అందాల రాక్షసి’లో హీరో అని చెప్పాడట. వెంటనే ప్రభాస్ ఆశ్చర్యపోయి.. రాహుల్ దగ్గరికి వచ్చి సారీ గుర్తుపట్టలేకపోయాను అన్నాడట.
తన లుక్ మారిపోవడం వల్ల పొరపాటు పడి ఉండొచ్చని.. ఆ లుక్‌లో ఇంటికి వెళ్తే తన తల్లి కూడా గుర్తు పట్టేది కాదని చెప్పాడట రాహుల్. అయినా సరే ప్రభాస్.. ఆ రోజు మళ్లీ మళ్లీ తన దగ్గరికి వచ్చి సారీ చెప్పి, ఏమనుకోకండి అని అంటూనే ఉన్నాడట. ఇలా పదిసార్లయినా తనకు సారీ చెప్పి ఉంటాడని.. మీరు సారీ చెప్పడమేంటి అన్నా కూడా ప్రభాస్ అలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడని.. అతను అంతటి జెంటిల్మెన్ అని రాహుల్ కితాబిచ్చాడు.