ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ … ప్లాన్ మారుస్తున్నారా? వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలో పేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? దీనికి పిఠాపురాన్ని ఆయన కేంద్రంగా మార్చుకోనున్నారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడే ఇల్లు కూడా నిర్మించుకుంటున్నారు. దీనికి గత ఏడాదే శంకు స్థాపన చేశారు. ఈ క్రమంలో 18 ఎకరాలకు పైగా భూమిని ఆయన కొన్నారు.
అయితే.. ఇప్పుడు మరో 3 ఎకరాలు(సుమారు) కొనుగోలు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు.. ప్రస్తుతం కొనుగోలు చేసిన భూమికి సమీపంలోనే మరో 2.5 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారాన్ని గమనిస్తే.. ఫ్యూచర్ ప్లాన్ అంతా.. పిఠాపురం నుంచే చేయనున్నట్టు తెలుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బలమైన జనసేన కార్యకర్తలు వున్నారు. వీరికి చేరువగా ఉండడం ఇప్పుడు పార్టీకి కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో ఇంటికి సమీపంలోనే జనసేన పార్టీ కార్యాలయంతోపాటు, కార్యకర్తల కోసం విడిదిని కూడా ఏర్పాటు చేసుకునే ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. పిఠాపురం హైవేను ఆనుకుని ఉన్న ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టడం ద్వారా రెండు గోదావరి జిల్లాల పార్టీ అభిమానులకే కాకుండా ప్రజలకు కూడా చేరువగా ఉండాలని పవన్ భావిస్తున్నారు.
తూర్పుగోదావరి పరిధిలోని నెంబరు 216 జాతీయ రహదారికి ఆనుకుని ఇలింద్రాడ రెవెన్యూ పరిధిలో స్థలాన్ని పవన్ కొనుగోలు చేశారు. ఇక్కడ నుంచే ఫ్యూచర్ రాజకీయాలను నడిపిస్తారన్న అంచనాలు వస్తున్నాయి. పైగా గోదావరి జిల్లాల పార్టీ నాయకులకు కూడా మరింత అందుబాటులో ఉండేందుకు ఈ నిర్మాణాలు అనుకూలంగా మారతాయన్న చర్చకూడా ఉంది.