సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే ఏపీ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్టులతో సర్ప్రైజ్ చేస్తున్నారు. బిగ్ రివీల్ అంటూ నిన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధం అయిన పెద్ద కంపెనీల పేర్లను ఆయన టైమ్ చెప్పి మరీ వెల్లడించారు. అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం ఒక ట్వీట్ చేశారు. తాను వేసుకున్న జాకెట్(కోటు) ఎలా ఉంది అంటూ ఆయన ప్రశ్నించారు. దీనిని ఏ మెటీరియల్తో ఎక్కడ తయారు చేశారో తెలుసా అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. మీరు ఊహించండి.. సరైన సమాధానం చెప్పిన వారికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్రకటించారు. దానికి సరైన సమాధానం తానే ఈ రోజు ఏడింటికి ప్రకటిస్తానని వెల్లడించారు.
లోకేష్ వేసుకున్న డ్రెస్ దేనితో తయారు చేశారని నెటిజర్లు చర్చించుకున్నారు. అయితే కరెక్ట్ గా ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. సరిగ్గా ఏడింటికి లోకేష్ తానే ఆన్సర్ ఇచ్చారు. ఈ జాకెట్ తయారు చేసింది మిలాన్ లో, ముంబైలో కాదు.. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం పులగుర్త గ్రామంలో తయారు చేసిందని తెలిపారు. చేనేతతో (మల్కా కాటన్) దీనిని తయారు చేశారని పేర్కొన్నారు. ఇది ఎంతో మృదువుగా ఉందని అన్నారు. కొన్ని ఉత్తమ ఫ్యాషన్లు మట్టి పుడతాయని ఆయన తెలిపారు. ఆ ఊరికి సంబంధించిన గూగుల్ మ్యాప్ కూడా ఆయన ట్వీట్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్త చేనేత సహకార సంఘం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సంఘం ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ప్రోత్సాహం పొందుతోంది. ఇక్కడ ప్రధానంగా చేనేత వస్త్రాలు, ముఖ్యంగా మల్కా కాటన్ వస్త్రాలు, సహజ వనరులను ఉపయోగించి తయారు చేస్తారు. సహజ సిద్ధమైన ప్రకృతి వనరులతో తయారు చేసే చేనేత వస్త్రాలు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఈ గ్రామంలోని అనేక కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తాయి, ఇక్కడ చాలామంది కార్మికులు తమ మగ్గాలను మల్కా వస్త్రాల తయారీకి అనుగుణంగా మార్చుకున్నారు. పులగుర్త చేనేత వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో బ్రాండ్ అంబాసిడర్లను గుర్తించడం మరియు ఫ్యాషన్ షోలు నిర్వహించడం వంటివి ఉన్నాయి. ఇప్పుడు నారా లోకేష్ ధరించిన జాకెట్ ఇక్కడే తయారు చేసిందే కావడం అందరినీ ఆకర్షించింది.