రాజకీయ వ్యూహకర్త.. జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ పీకే.. బీహార్ లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్ని కల్లో చావు దెబ్బతిన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆయన కనీసం 230 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినా.. ఒక్కరు కూడా డిపాజిట్ దక్కించుకునే పరిస్థితి కనిపించని దారుణ స్థితికి చేరుకున్నారు.దీంతో పీకేకు ఉన్న ఇమేజ్ దాదాపు తగ్గిపోయిందన్న కామెట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఆయన సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లు కూడా తగ్గు ముఖం పట్టారు.
ఇదిలావుంటే.. తాజాగా మీడియా ముందుకు వచ్చిన పీకే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎన్డీయే కూటమి విజయంపై ఆయన కామెంట్లు కుమ్మరించారు. దేశ ప్రజల కోసం.. ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చిందన్నారు. ఇది సహజమే. అయితే.. ఇలా తెచ్చిన సొమ్ములో 14 వేల కోట్ల రూపాయలను బీహార్ ఎన్నికలకు ఖర్చు చేశారని చెప్పారు. దీనికి ఉదాహరణగా ఆయన ఓ కీలక విషయాన్ని వెల్లడించారు.
“మీకు గుర్తుండే ఉంటుంది.. మొన్నటి ఎన్నికలకు నెల రోజుల ముందు.. రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందనగా.. రాష్ట్రంలో ప్రతి మహిళకు నితీష్ ప్రభుత్వం 10 వేల రూపాయలు బ్యాంకుల్లో వేసింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో లెక్కలు చెప్పలేదు. దీనికి నెల ముందు.. రాష్ట్రంలో ఉద్యోగులు జీతాలు పెంచమని డిమాండ్ చేశారు. ఆ సమయంలో సీఎం నితీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖజానా ఖాళీ అయిందన్నారు. మరి అలాంటప్పుడు మహిళలకు ఇచ్చేందుకు అన్ని వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి?. అంటే ప్రపంచ బ్యాంకు ఇచ్చిన సొమ్మును కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. అది ఎన్నికల కోసమే ఇచ్చింది.” అని పీకే ఆరోపించారు.
తాజా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగలేదన్న పీకే.. ఇవి పూర్తిగా ఓటు కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే జరిగిన ఎన్నికలుగా గుర్తించామన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే.. పీకే చేసిన వ్యాఖ్యలపైనెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఎవరు నమ్ముతారు? అని కొందరు కామెంట్లు చేస్తే.. మరికొందరు “మీరు ఓ 50 స్థానాల్లో విజయం దక్కించుకుని ఉంటే ఇలానే చెప్పేవారా?” అని ప్రశ్నించారు. కాగా.. ఈ ఎన్నికల్లో పీకే పార్టీ 3.3 శాతం ఓట్లు దక్కించుకుందని ఎన్నికల సంఘం డేటా వెల్లడించింది.