నేడు(నవంబరు 19) దేశ మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ జయంతి. 1917, నవంబరులో ఆమె జన్మించారు. దేశానికి ప్రధాన మంత్రిగా చేశారు. కూడు-గూడు-గుడ్డ నినాదాన్ని అందిపుచ్చుకుని పేదలను తనవైపు తిప్పుకొన్నారు. అయితే.. ఎమర్జెన్సీ కారణంగా.. ఇందిరమ్మ ప్రజా ప్రాభవం కోల్పోయింది. ఇదిలావుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి `ఇందిరా మహిళా శక్తి` అనే పేరు పెట్టింది. ఈ పథకం కింద.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్లోని మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతో సుదీర్ఘంగా చర్చించారు. శాంపిల్‌గా కొన్ని చీరలను కూడా పరిశీలించారు. గ్రామాలు, పట్టణాల్లో ఒకే తరహా చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. సీఎం పరిశీలించిన చీరల నాణ్యత బాగుందని.. క్వాలిటీ కూడా నాణ్యంగా ఉందని కితాబు నిచ్చారు. తెలుపు, నీలం కలబోతతో ఈ చీరలను ఎంపిక చేయించారు. సిరిసిల్ల సహా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా.. చీరలను కొనుగోలు చేశారు. కాగా.. రెండు విడతలుగా ఇందిరా మహిళా శక్తి పేరిట చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబరు 19న తొలిదశ పంపిణీ చేయనున్నారు.
ఇది.. డిసెంబరు 8వ తారీకు వరకు కొనసాగుతుంది. ఈ దశలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళలకు చీరలను పంపిణీ చేస్తారు. కాగా.. ఇదేసమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పాలనపై కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. అనంతరం.. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్ననేపథ్యంలో రెండో దశను మార్చి వరకు పొడిగించారు. రెండో దశలో పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలను పంపిణీ చేస్తారు. దీనిలో భాగంగా మార్చి 1 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. మొత్తంగా కోటి మందికి చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం రెడీ చేసింది.
గతంలో..
గతంలో కేసీఆర్ సర్కారు కూడా బతుకమ్మ చీరల పేరిట పేద కుటుంబాలకు చీరలను పంపిణీ చేసింది. అయితే.. అప్పట్లో ఇది వివాదం అయింది. చీరల నాణ్యత సరిగా లేదనిపేర్కొంటూ మహిళలు.. రోడ్డెక్కి నిరసన తెలిపారు. మరికొన్నిచోట్ల అధికారుల అలసత్వం కారణంగా.. చీరలు గోడౌన్ కూడా దాటలేదు. మరోవైపు .. సిరిసిల్ల చేనేత కార్మికులకు.. కేసీఆర్ సర్కారు బకాయి పెట్టింది. ఇది కూడా రాజకీయంగా వివాదానికి దారి తీసింది. అయితే.. మెజారిటీ గ్రామీణులకు మేలు చేసిందన్న వాదన కూడా వినిపించింది. కానీ, ఇది గత ఎన్నికల్లో బీఆర్ ఎస్‌కు పెద్దగా ఫలించలేదు.