hyderabadupdates.com movies బీ అలెర్ట్: పవన్ చేరువగా వైసీపీ కార్యకర్త అనుమానాస్పద కదలికలు..!

బీ అలెర్ట్: పవన్ చేరువగా వైసీపీ కార్యకర్త అనుమానాస్పద కదలికలు..!

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్ళింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి- ఉప ముఖ్యమంత్రికి చేరువగా సంచరించారు. ఆ రోజు శంకరగుప్తం డ్రయిన్ మూలంగా దెబ్బ తిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ, అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో, ఆ తరవాతి కార్యక్రమాల్లో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు.

ఇతను రాజోలు నియోజక వర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది. అతని వ్యవహార శైలి, కదలికలపై అనుమానం వ్యక్తమయింది. ఈ విషయాన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తీసుకువెళ్లారు. అతని కదలికలు, కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడంపై ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించారు. తగిన విచారణ చేపట్టాలన్నారు. వైసీపీకి చెందిన వ్యక్తి పవన్ కు అంత దగ్గరగా ఎందుకు సంచరించాడు అనేదానిపై విచారించాల్సి ఉంది. భద్రతా వైఫల్య కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఏ పర్యటనకు వెళ్ళిన పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తుంటారు. ఆయనకు దగ్గరగా చేరుకోవాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తుంటారు. ఇదే విషయాన్ని పవన్ రాజోలు సభలో కూడా ప్రస్తావించారు. ప్రధాని కశ్మీర్ పర్యటనకు వెళ్లినా ఇబ్బంది ఉండదుగాని.. మీరున్న సభకు రావాలంటే జనసేన అభిమానుల ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియడం లేదని మోదీకి రక్షణ కల్పించే ఎస్పీజీ బృందం తనతో అన్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి భద్రతపై ఆయన కార్యాలయం ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related Post