హైదరాబాద్: ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న మెట్రో రైలును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-Iను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని సర్కార్ గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఎల్ అండ్ టీతో కొద్ది రోజులుగా ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ ఛైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టి , ఎల్టీ ఎంఆర్హెచ్ఐ ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో ఆయా సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్లీఎంఆర్ హెచ్ ఎల్ కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై సంస్థ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టి తరఫున డి.కె.సేన్, LTMRHL తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ హామీతో సదరు సంస్థపై ఉన్న రూ. 13,538.53 కోట్ల అప్పును (2026, ఏప్రిల్ 30వ తేదీ నాటికి) తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఐడీబీఐ క్యాపిటల్ వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను సరాఫ్ పార్టనర్ సంస్థ అందించింది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో ఎల్ అండ్ టి మెట్రో రైల్ సంస్థ 2017 నవంబర్ నుంచి
మూడు కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–Iను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–Iను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఫేజ్–I, ప్రతిపాదిత ఫేజ్–II నెట్‌వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్‌లోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, ఆధార పడదగిన, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
The post హైదరాబాద్ మెట్రో రైల్ ప్రభుత్వం స్వాధీనం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రభుత్వం స్వాధీనం
Categories: