వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వెంకట్‌రెడ్డిపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీశ్‌కుమార్ ఈనెల 14న తాడిపత్రి సమీపంలో రైల్వేట్రాక్ పక్కన హత్యకు గురయ్యారు. దీనిపై ఏపీ పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు సీఎం చంద్రబాబుపై వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం, సీఎంపై వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత ప్రసాదనాయుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూకట్‌పల్లిలోని మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో కారుమూరు వెంకట్‌రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ఉదయం అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు.
కేసు ఏమిటంటే ?
టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ వెంకటరెడ్డిపై చర్యలకు దిగారు. తాడిపత్రి రూరల్ పోలీసులు 352, 353(1)(2), 196(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వెంకటరెడ్డి అరెస్ట్ అక్రమం – మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు
దేశంలో ఎక్కడా లేని దుష్ట సాంప్రదాయానికి రాష్ట్రంలో కూటమి నాయకులు శ్రీకారం చుట్టారు. టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ అనుమానాస్పద మృతి కేసులో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీస్ శాఖలో సీఐ స్థాయి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణిస్తే త్వరితగతిన విచారణ చేసి ఆయనది హత్యో, ఆత్మహత్యో నిర్ధారించడంలో పోలీసులు విఫలమయ్యారు. టీడీపీ నాయకులు సతీష్ కుమార్‌ది హత్య అని ప్రచారం చేస్తుంటే ఏ ఆధారాలతో చెబుతున్నారని టీడీపీని ప్రశ్నించినందుకు వెంకటరెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు. సతీష్ కుమార్ చనిపోయాడని తెలిసిన వెంటనే ఆయన భార్య దగ్గర ఫోన్ స్వాధీనం చేసుకోవడం, మీడియాతో మాట్లాడకుండా వారి కుటుంబాన్ని నిలువరించడం వంటి వాటిపై ప్రభుత్వాన్ని కారుమూరి నిలదీశాడు.
The post Karumuru Venkat Reddy: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Karumuru Venkat Reddy: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్
Categories: