దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న వెంటనే నేరుగా ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన వారితో మాట్లాడి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల పరిస్థితిని అక్కడి వైద్యులు ఆయనకు వివరించారు. బాధితులను పరామర్శించిన దృశ్యాలను ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘దాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతాం’’ అని హామీ ఇచ్చారు.
బాంబు దాడి కుట్రదారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని భూటాన్ పర్యటన సందర్భంగానూ ప్రధాని మోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే. కేంద్ర సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని, దాడికి కారణాలను అధికారులు త్వరలో వెల్లడిస్తారని తెలిపారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధాని రాక కోసం ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద మీడియా వేచి ఉండటంతో ఆయన ఆసుపత్రిలో వెనుక వైపునున్న ప్రత్యేక గేటు ద్వారా లోపలకు వెళ్లారు. ఢిల్లీలో పేలుడుకు బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వారిని చట్టం ముందు ఉంచుతామని పేలుడు ఘటన అనంతరం మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీ పేలుడు దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది.
ఢిల్లీ పేలుడు ఘటనలో మరో కారు స్వాధీనం
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం(నవంబర్ 10వ తేదీ) రాత్రి జరిగిన భారీ పేలుళ్లలో అక్కడికక్కడే తొమ్మిది మంది దుర్మరణం చెందగా… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు అసువులు బాశారు. ఈ ఉగ్ర కార్యకలాపాలకు కారణమైన ఒక్కొక్కరినీ స్పెషల్ టీమ్స్ అదుపులోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో కారును స్వాధీనం చేసుకున్నారు. హరియాణాలోని ఖండవాలీ గ్రామంలో రెడ్ పోర్డ్ ఈకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ ఉమర్‌దిగా గుర్తించారు. ఆ కారు సదరు గ్రామంలో ఓ ఇంటి బయట పార్క్ చేసి ఉండటంతో దాన్ని తనిఖీ చేసి చూడగా అది ఉమర్ మహ్మద్‌కు చెందినిదిగా కనుగొన్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కారులోనే ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి భారీ పేలుడు పదార్థాలను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.
The post PM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
PM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ
Categories: