కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో దారుణం చోటు చేసుకుంది. గెర్రే గ్రామంలో రాణి అనే 9 నెలల గర్భిణిని ఆమె మామ సత్యనారాయణ హత్య చేశాడు. గొడ్డలి, కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. సత్యనారాయణ కుమారుడు శేఖర్ అదే గ్రామంలో ఎదురింట్లో ఉండే రాణిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. వేర్వేరు కులాలు కావడంతో శేఖర్ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో కుటుంబంలో కలహాలు చెలరేగాయి. దీనితో శేఖర్, తన భార్యతో కలిసి అత్తవారింట్లోనే ఉంటున్నాడు. శనివారం అత్తమామలతోపాటు శేఖర్ అడవికి వెళ్లినట్లు తెలుసుకున్న సత్యనారాయణ… ఎవరూ లేని సమయం చూసి… రాణిని దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలో రోడ్డుప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లి కుమార్తె మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తల్లి, కుమార్తె మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన విశ్రాంత సింగరేణి కార్మికుడు పి.విఘ్నేష్‌కు… స్రవంతి, తేజస్వి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలు జరగ్గా… వీరు అమెరికాలో స్థిరపడ్డారు. తేజస్వి గృహప్రవేశం కోసం గత నెల 18న విఘ్నేష్‌తో పాటు ఆయన భార్య రమాదేవి అమెరికా వెళ్లారు. శుక్రవారం పెద్ద కుమార్తె కుమారుడు నిశాంత్ జన్మదినం సందర్భంగా విఘ్నేష్‌తో పాటు రమాదేవి, తేజస్వి కారులో వెళ్లారు. శనివారం ఉదయం తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో రమాదేవి(55), తేజస్వి(30)మృతి చెందగా, మిగతా కుటుంబ సభ్యులు గాయపడినట్టు సమాచారం.
టపాసుల గోదాంలో అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా, ఆందోల్ శివారులోని కటుకం వేణుగోపాల్ & సన్స్ టపాసుల గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తి అగ్గి రాజేయడంతో మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. విక్రయదారులకు తృటిలో పెనుప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. బాణాసంచా గోదాం యాజమాన్యం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో టపాసుల గోదాం పూర్తిగా కాలి బూడిదైంది.
The post Pregnant: కుమురం భీం జిల్లాలో నిండు గర్భిణి దారుణ హత్య appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Pregnant: కుమురం భీం జిల్లాలో నిండు గర్భిణి దారుణ హత్య
Categories: