వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ జగన్ పర్యటన వివరాలను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం… వైఎస్ జగన్ గురువారం (09.10.2025) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడినుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (వయా-ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్) వెళ్ళి మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు.
అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా – తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్‌ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్ధులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు.
వైఎస్ జగన్ పర్యటన యథావిధిగా కొనసాగుతుంది – ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం పర్యటన రేపు(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) యథావిధిగా కొనసాగుతుందని పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, రోడ్డు మార్గాన మెడికల్ కాలేజ్‌కి వెళ్తారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ మీదుగా వెళ్లేందుకు పోలీసులు రూట్ మార్చారన్నారు. వైఎస్ జగన్ తన తిరుగు ప్రయాణంలో కేజీహెచ్‌కు వెళ్తారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శిస్తారు. 70 మంది వివిధ హాస్పిటల్స్ లో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు మరణించారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్ జగన్ బయటకు వస్తున్నారంటేనే చంద్రబాబుకు వణుకు పుడుతుంది.జగన్ పర్యటనకు ప్రజలు రాకుండా భయపెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు కట్టే ఫ్లెక్సీలను అడ్డుకుంటున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ… ‘జగన్ పర్యటనపై పోలీసులు హైడ్రామా నడిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవడానికి వీల్లేదు అంటూ రూటు మార్చారు. మాకు ప్రజా సమస్యలు ముఖ్యం. పోలీసుల రూట్ మార్చిన వైఎస్ జగన్ నర్సీపట్నం వెళుతున్నారు. వైఎస్ జగన్ కలవడానికి వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నారు. జగన్ పర్యటనకు లేనిపోని ఆంక్షలు పెట్టారు. 10 కార్లు మాత్రమే కాన్వాయ్ లో ఉండాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా ?, రాచరిక పాలనలో ఉన్నామా ? అనే అనుమానం కలుగుతుంది. జగన్ పర్యటనను ఎంత అణగదొక్కాలని చూస్తే అంత తిరుగుబాటు మొదలవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ, చిరు వ్యాపారుల సమస్యలు ఉన్నాయి’ అని తెలిపారు.
జగన్‌వి వీకెండ్ పాలిటిక్స్ – మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
వైసీపీ అధినేత జగన్ వారాంతపు రాజకీయాలు (వీకెండ్ పాలిటిక్స్) చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పర్యటనల పేరుతో హడావుడి చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో తమ ఇళ్లకు తాళాలు వేసి అడ్డుకున్నారన్నారు.
‘‘జగన్ పరామర్శలకు మా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సత్తెనపల్లి, గుంటూరు మిర్చియార్డు, రాప్తాడు, నెల్లూరు పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. విశాఖలో పరిశ్రమల అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో జగన్ పర్యటనకు భారీగా జన సమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు కుట్ర చేశారు. విశాఖలో గురువారం మహిళల ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతోంది. వైసీపీ నాయకులు ఇష్టానుసారం చేస్తామంటే చూస్తూ ఊరుకోం’’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు.
The post YS Jagan: జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనకు వైసీపీ విస్తృత ఏర్పాట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
YS Jagan: జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనకు వైసీపీ విస్తృత ఏర్పాట్లు
Categories: