వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గురువారం పర్యటించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుండి
నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన కోసం రోడ్డు మార్గంలో బయలుదేరిన జగన్ కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా నీరాజనం పట్టారు. పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని అంతా కదలి వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు, పలువురు తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌ఏడీ జంక్షన్, వేపగుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్ మీదుగా అనకాపల్లి జిల్లా భీమబోయినపాలెం వరకు సుమారు 60 కి.మీ మేర జనాలు స్వాగతం పలికారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జగన్ కు బ్రహ్మరథం పట్టారు. నేరుగా నిర్మాణంలో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ కు చేరుకున్న జగన్… ప్రతిపాదిత మెడికల్ కాలేజీ నిర్మాణాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆధునిక దేవాలయాలుగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని తెచ్చాం. ప్రతి మెడికల్ కాలేజీ ఒక ఆధునిక దేవాలయం. పేదలకు మెరుగైన వైద్యం, సూపర్, మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా ఈ ఆధునిక దేవాలయాల వల్లే సాధ్యమవుతుందని భావించాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ మేలు జరిగే కార్యక్రమం ఇది. ప్రతి జిల్లా పరిధిలోని ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాలకు ఒక్కో మెడికల్ కాలేజీ తీసుకురావడం వల్ల పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి.
ప్రైవేటు వైద్యం పేదలపై ఆర్థిక భారం కాకుండా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో దగాకు కాకుండా అడ్డుకట్ట పడుతుంది. ఈ మంచి ఉద్దేశంతోనే మా హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు వేశాం. ఈరోజు నర్సీపట్నంలో ఉన్న ఈ కాలేజీ 52 ఎకరాల్లో నిర్మాణం జరుగుతోంది. ఈ కాలేజీకి సంబంధించి 2022, డిసెంబరు 30న ముఖ్యమంత్రిగా నేనే శంకుస్థాపన చేశాను. ఆనాడు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ కష్టాలను అధిగమించి రూ.500 కోట్ల ఖర్చుతో, ఏడాదికి 150 మెడికల్ సీట్లు విద్యార్ధులకు అందుబాటులోకి వచ్చేలా మంచి ప్రణాళికతో నిర్మాణ పనులు ప్రారంభించాం. ఈ కాలేజీ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యి ఉంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా అత్యంత అద్భుతంగా కనిపించే కాలేజీని మనం చూసే వాళ్ళం. ఈ కాలేజీ వల్ల ఇక్కడ 600 బెడ్లతో ఆసుపత్రి వచ్చేది. ఇంకా ఈ కాలేజీ ఈ ప్రాంతం మొత్తానికి ఒక దిక్సూచిగా ఉండేది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఈ కాలేజీ ఒక మెడికల్ హబ్‌గా మారేది.
ఈరోజు ఆరోగ్యపరంగా ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా విశాఖలోని కేజీహెచ్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఇదొక్కటే ఈ ప్రాంతానికి దిక్సూచిగా ఉంది. రోజూ వందలాది మంది వైద్యం కోసం కేజీహెచ్‌కు వెళ్తున్నారు. అక్కడ సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. నేడు సీఎం చంద్రబాబు వ్యవహారశైలి చూస్తుంటే, పేదవాడికి భవిష్యత్ లేకుండా అన్యాయం చేస్తున్నాడు. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో కేవలం 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అప్పట్లో బ్రిటిష్‌వాళ్లు కట్టిన కేజీహెచ్ ఆసుపత్రి ఒక్కటే ఉండేది. ఆ తరువాత నాన్నగారు తమ హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్‌ను తీసుకువచ్చారు. అలా ఉత్తరాంధ్రలో మొత్తంగా రెండు కాలేజీలు మాత్రమే ఉండేది. ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైసీపీ హయాంలో, ఏకంగా మరో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ముఖ్యమంత్రిగా ఆనాడు శ్రీకారం చుట్టాం. విజయనగరం, పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం ప్రాంతాల్లో నాలుగు కాలేజీల నిర్మాణం మొదలుపెట్టాం. వాటిలో విజయనగరం, పాడేరు కాలేజీల్లో క్లాస్‌లు కూడా మొదలయ్యాయి. విజయనగరం కాలేజీని 2023లో ప్రారంభించాం. పాడేరులో 2024 ఎన్నికల నాటికి క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. ఇంకా పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ ఫొటోలు, భవనాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి.
మా ప్రభుత్వ నిర్ణయాలు ఉత్తరాంధ్రకు మేలు చేస్తే, నేడు సీఎం చంద్రబాబు ఈ ప్రాంతానికి నష్టం చేకూర్చేలా కుట్రలు చేస్తున్నాడు. 17 మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలు మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. వాటిలో 5 కాలేజీల్లో మా హయాంలోనే క్లాస్‌లు కూడా మొదలయ్యాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో 2023–24లో క్లాస్‌లు ప్రారంభమై, ఇప్పటికే మూడు బ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. ఈ ఐదు కాలేజీల్లో 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే పులివెందుల, పాడేరు కాలేజీలకు సంబంధించి చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి, పాడేరులో 50 శాతం సీట్లతో క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. పులివెందుల కాలేజీకి ఎంసీఐ 50 సీట్లు ఇచ్చినా, అవి వద్దని చంద్రబాబు వెనక్కి పంపించారు. మా ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీల కోసం దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేశాం. వాటిలో ఏడింటి పనులు పూర్తి కాగా, మిగిలిన 10 కాలేజీలకు మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మరి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే కొన్ని కోట్ల మంది పేదవాళ్లకు ఆధునిక దేవాలయాల కింద ఉచితంగా వైద్యం అందుతుంది.
రాష్ట్రంలో 2019 నాటికి 2360 మెడికల్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా మరో 2550 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. అంటే మన రాష్ట్రంలోనే మొత్తం 4910 మెడికల్ సీట్లు విద్యార్ధులకు అందుబాటులోకి వస్తాయి. కొత్తగా వచ్చే మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. మరో సగం సీట్లు ప్రైవేట్ కంటే అతి తక్కువ ఫీజుకు అందుబాటులోకి వస్తాయి. ఇంకా కొన్ని కోట్ల మందికి మంచి వైద్య సేవలందుతాయి. అలాంటి వీటిని చంద్రబాబు దగ్గరుండి పేదవాడి చదువును, వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నాడు. పేదలకు ఎంతగానో ఉపయోగపడే వైద్య కళాశాలలు, దానికి అనుబంధంగా ఏర్పాటయ్యే సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలకు ఎందుకు ఆటంకాలు కలిగిస్తున్నారు?. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల పేదలకు ఎలా మేలు జరుగుతుంది? ప్రైవేటు యాజమాన్యాలు మెడికల్ కాలేజీని నడిపితే, పేదలకు ఉచిత వైద్యం అనేది ఎలా అందుతుంది? మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రై వేట్‌పరం చేస్తే పేదవాడికి ఎలా మంచి జరుగుతుంది. ప్రైవేటు యాజమాన్యంలో పేదవాడికి ఏరకంగా భరోసా ఉంటుంది?. ఉచిత వైద్యం అన్నది పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? పేదవాడు దగా పడకుండా ఏం చేయగలుగుతారు?.
స్పీకర్ నోట పచ్చి అబద్ధాలు
ఇక్కడ నర్సీపట్నం ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు స్పీకర్ పదవిలో ఉన్నారు. ఆయన కూడా చంద్రబాబు మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ… తాను కూడా చంద్రబాబు కంటే తక్కువేమీ కాదని రుజువు చేసుకుంటున్నాడు. స్పీకర్ గారిని అడుగుతున్నా. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత వరకు ధర్మం? ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదంటారా?. ఇదిగో అయ్యా జీవో నం:204. ఆగస్టు 8, 2022న జారీ అయింది. మరి ఈ జీఓ లేదని స్పీకర్ పదవిలో ఉండి అబద్ధాలు చెప్పినందుకు, నీవు ఆ పదవికి అర్హుడివేనా? అని ఆలోచన చేసుకోవాలి. తప్పుడు మాటలు చెబుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుతో చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తలదించుకోవాలి. ఇదే చంద్రబాబు 2024 జూన్ లో అధికారంలోకి వచ్చాడు. సెప్టెంబరు 3న, ఒక మెమో రిలీజ్ చేశాడు. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో నిర్మాణాలు పూర్తిగా ఆపేయాలని అందులో నిర్దేశించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే కొత్త మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆస్పత్రులు వదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కాలేజీలకు ఫండింగ్ లేదని అంటున్నారు. అయ్యా చంద్రబాబూ, అయ్యా నర్సీపట్నం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెబుతున్నా.. నాబార్డు ఫండ్స్‌తో అప్పట్లోనే ఈ ప్రాజెక్టులను టైఅప్ చేశాం. నాబార్డు ఫండ్స్ మాత్రమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో కూడా ఈ ప్రాజెక్టులను పెట్టడం జరిగింది. దాని అర్థం మరో 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వారు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్టులకు మంజూరవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెంట్స్ స్కీమ్స్‌లో ఈ ప్రాజెక్ట్‌లు వస్తున్నప్పుడు, నాబార్డు నుంచి కూడా లోన్ శాంక్షన్ అయినప్పుడు, వీటికి కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే అవసరం ఉన్నప్పుడు… ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా?. దీని కోసం ఇన్ని అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేస్తూ నిసిగ్గుగా వ్యవహరిస్తున్న తీరుకు చంద్రబాబునాయుడు సిగ్గుతో తల దించుకోవాలి.
గిరిజన విద్యార్థినిలకు శాపం
పక్కనే కురుపాం. పార్వతీపురం మెడికల్ కాలేజీ పూర్తయిపోయి ఉంటే ఈరోజు కురుపాంలో జరిగిన ఘటనకు వెంటనే వైద్యం అంది ఉండేది. 611 మంది చదువుకుంటున్న కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో హెపటైటిస్–ఏ (జాండిస్)కు గురై సరైన వైద్యం అందక ఏకంగా ఇద్దరు పిల్లలు చనిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గురుకుల పాఠశాలలో ఏకంగా 170 మందికి హెపటైటిస్–ఏ (జాండీస్) వస్తే, వారికి తగిన వైద్యం అందించలేకపోయారు. స్కూల్‌లో జాండిస్ సోకినట్లు సెప్టెంబరు 10న గుర్తించినా, తగిన వైద్యం అందించలేకపోయారు. దీంతో అక్టోబర్ 1వ తేదీ నాటికి ఇద్దరు విద్యార్థినిలు చనిపోయారు. అంజలి అనే పాప సెప్టెంబరు 25న, కల్పన అనే పాప అక్టోబర్ 1న చనిపోయింది. ఇద్దరు పిల్లలు చనిపోతే తప్ప, కనీసం స్క్రీనింగ్ చేయాలనే ఆలోచన కూడా వీళ్లకు రాలేదు. చివరకు స్క్రీనింగ్ చేస్తే 170 మందికి జాండిస్ వచ్చినట్లుగా నిర్ధారణ అయ్యింది. చంద్రబాబునాయుడు హయాంలో హాస్పిటల్స్ పరిస్థితి, స్కూళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.
611 మంది చదువుకుంటున్న స్కూల్‌లో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఆర్వో ప్లాంట్లు పెట్టాం. ఆ ఆర్వో ప్లాంట్‌కు ఫిల్టర్లు మార్చాలనే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. ఆర్వో ప్లాంట్ ఉండి కూడా సురక్షిత తాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబు లేరంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతున్నా. ఆర్వో ప్లాంట్ లో ఫిల్టర్లు సరిగ్గా పని చేయడం లేదు, నీళ్లు కలుషితమైనా పట్టించుకునే నాథుడు లేడు.
అనంతరం విశాఖ నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల విద్యార్థులను వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. కేజీహెచ్‌లోని పచ్చకామెర్ల బాధిత విద్యార్థులను వైఎస్ పరామర్శించారు. పచ్చకామెర్ల బారిన పడ్డ బాధిత విద్యార్థులతో వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్ బయట మీడియాతో మాట్లాడారు. ‘170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వచ్చాయి. పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. స్కూళ్లు, హాస్టల్స్‌లో బాత్రూమ్‌లను శానిటేషన్ చేయాలి. ఒకే స్కూల్ నుంచి 65 మంది విద్యార్థులు కేజీహెచ్‌లో చేరారు. కురుపాం నుంచి 200 కి.మీ దూరంలో కేజీహెచ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి కేసులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కలుషిత నీటి వల్లే పిల్లలకు ఈ పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 170 మంది పిల్లలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇప్పటికైనా వాటర్ ప్లాంట్‌ను రిపేర్ చేయించాలి. పిల్లల తరఫున మేం మెడికో లీగల్ కేసు వేస్తాం. వైఎస్సార్‌సీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందజేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
The post YS Jagan: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం – వైఎస్ జగన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.