మాస్ జాతర ఫలితం గురించి బాక్సాఫీస్ కు క్లారిటీ వచ్చేసినట్టే. గత కొంత కాలంగా మిమ్మల్ని పెట్టిన చిరాకును దీంతో తగ్గిస్తానని స్టేజి సాక్షిగా చెప్పిన రవితేజ మరోసారి మాట తప్పేశారు. రొటీన్ కంటెంట్ తో అంతకంటే రెగ్యులర్ ట్రీట్ మెంట్ తో దర్శకుడు భాను భోగవరపు వండిన వంటకం ఆడియన్స్ కి అంతగా నచ్చలేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఫ్యాన్స్ కొంత మేర సంతృప్తిపడినట్టు కనిపించినప్పటికీ ఓవరాల్ గా ప్రేక్షకుల కోణంలో చూసుకుంటే అంచనాలు అందుకోవడం లో మాస్ మహారాజ మరోసారి తడబడ్డారు. ఇక హీరోయిన్ శ్రీలీల విషయానికి వస్తే ధమాకా తర్వాత మరో బ్లాక్ బస్టర్ అందని ద్రాక్షే అయ్యింది.
ఒకవైపు అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి. మహేష్ బాబు అంతటి స్టారే గుంటూరు కారం కోసం పూజా హెగ్డేని వద్దనుకుని శ్రీలీలకు ఓటేశాడు. నితిన్, రామ్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోల నుంచి కిరీటి లాంటి కొత్త కుర్రాళ్ళ దాకా అందరూ తననే ఛాయస్ గా పెట్టుకుంటున్నారు. కానీ గత కొన్నేళ్ల ట్రాక్ రికార్డు చూస్తే ఒక్క భగవంత్ కేసరి మాత్రమే శ్రీలీల గర్వంగా చెప్పుకునే హిట్టుగా నిలిచింది. అందులో ప్రధాన పాత్రే అయినప్పటికీ తను హీరోయిన్ కాదు కాబట్టి ఈ ఆనందం సగమే దక్కింది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, రాబిన్ హుడ్, జూనియర్ అన్నీ పోయాయి. గుంటూరు కారం కూడా ఆల్ హ్యాపీస్ కాదు.
ఇప్పుడీ మాస్ జాతర విషయంలో తనను నిందించడం భావ్యం కాదు కానీ కథల ఎంపికలో ఇకపై ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక హెచ్చరికగా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకే తరహా పాత్రలతో క్రమంగా తనలో నటి కన్నా డాన్సులు, గ్లామర్ నే దర్శకులు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఇది కెరీర్ ని త్వరగా క్లైమాక్స్ కు తీసుకొస్తుంది. హిందీలో ఆఫర్లు వస్తున్నా, మంచి కాంబినేషన్లు పడుతున్నా ముందైతే ఇక్కడ గెలవాలి. రష్మిక మందన్న, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాగా కొంచెం ఛాలెంజింగ్ అనిపించేవి ఎంచుకోవాలి. లేదంటే ఇలాంటి ఫలితాలు మళ్ళీ మళ్ళీ రిపీటవుతూనే ఉంటాయి.